25 August, 2026 | 6:53 AM

నిర్మాణ సామగ్రి చోరీ ముఠా గుట్టురట్టు

25-08-2026 12:00 AM

ఐదుగురి అరెస్టు.. 

రూ.లక్ష నగదు, రెండు వాహనాలు స్వాధీనం

శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): నల్లగండ్లలో నిర్మాణ సామగ్రి చోరీకి పాల్పడుతున్న ముఠాను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.లక్ష నగదు, చోరీకి ఉపయోగించిన ట్రాలీ ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.

మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని ఆర్సీ పురం డివిజన్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు.నల్లగండ్లలోని వెర్టెక్స్ వేగా డెవలపర్స్కు చెందిన నిర్మాణ సామగ్రి నిల్వ ప్రాంతంలో ఈ నెల 19, 20 తేదీల మధ్య అర్ధరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంటన్నర మధ్య దుండగులు షీట్మెటల్ కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అక్కడ నిల్వ ఉంచిన మివాన్ అల్యూమినియం బోర్డులు, బారికేడింగ్ షీట్లను ఎత్తుకెళ్లారు.

సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 24న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కొండాపూర్ మసీద్బండ వడ్డెరబస్తీకి చెందిన ఆనంద్ (21), అనిల్ (26), బాలాజీ (19), రాఘవేంద్రకాలనీకి చెందిన సుభాష్ (23), న్యూహఫీజ్పేట ప్రేమ్నగర్కు చెందిన యోగేష్ దండగులె (20)ను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఆనంద్ ట్రాక్టర్ డ్రైవర్గా, అనిల్, బాలాజీ ఆటో డ్రైవర్లుగా, సుభాష్ డ్రైవర్గా, యోగేష్ కూలీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో నిందితులు మరో మూడు చోరీ కేసుల్లోనూ తమ ప్రమేయాన్ని వెల్లడించినట్లు ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చందానగర్ పోలీస్స్టేషన్లో నమోదైన మరో కేసుతోపాటు గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని రెండు కేసుల్లోనూ వీరి హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడు ఆన్ంప గతంలో గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో మరో కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

చోరీ చేసిన నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేసిన స్క్రాప్ డీలర్ బదరాని రత్నాకర్ (34)ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చందానగర్ రైల్వేస్టేషన్ రోడ్డు పాపిరెడ్డి కాలనీకి చెందిన రత్నాకర్ నుంచి నాలుగు కేసులకు సంబంధించిన మొత్తం రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ట్రాలీ ఆటోను బాలాజీ నుంచి, హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ను రత్నాకర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఈ కేసులో ఏ6 రాజు, ఏ7 విజయ్, ఏ8 చరణప్ప, ఏ10 రాజు పరారీలో ఉన్నారు. వీరంతా హఫీజ్పేట ప్రేమ్నగర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు ఆర్సీ పురం డివిజన్ ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్ తెలిపారు.నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇన్స్పెక్టర్లు ఏ. శ్రీధర్కుమార్, కే. ప్రదీప్కుమార్, డిటెక్టివ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.