ధాన్యం స్కాంలో ఇద్దరి అరెస్ట్
- రూ.7.55 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి
- మరో ముగ్గురి కోసం గాలింపు
- డీఎస్పీ శ్రీనివాసులు
వేములవాడ, ఆగస్టు 24, (విజయ క్రాంతి): వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ ధాన్యం దుర్వినియోగం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వేములవాడ డీఎస్పీ ఎ శ్రీనివాసులు తెలిపారు. వేములవాడ మండలం కోనాయిపల్లిలోని కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లు (ఎం/ఎస్ అంజనేయ ట్రేడర్స్) నిర్వాహకులు వివిధ సీజన్లలో ప్రభుత్వం సేకరించిన 8,447.138 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఒప్పందం ద్వారా తీసుకున్నారు.
అయితే మిల్లింగ్ అనంతరం సివిల్ సప్లయ్‌స్ కార్పొరేషన్‌కు అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మిల్లు భాగస్వాములు, ఏజెంట్లుగా చేపూరి అంజయ్య, ఆచం సంతోష్, దొంతుల గణేష్, చేపూరి మధుకర్, లోపెల్లి వెంకటేశ్వర్‌రావు వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వానికి అందించాల్సిన ధాన్యం విలువ రూ.7,55,71,688గా నిర్ధారించారు.
సివిల్ సప్లయ్‌స్ జిల్లా మేనేజర్ జి.గోపాల్ ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నేరం రుజువు కావడంతో ఏ1 చేపూరి అంజయ్య, ఏ5 లోపెల్లి వెంకటేశ్వర్రావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.






