నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ప్రవాహం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి మంగళవారం ఉదయం 6,060 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు( 17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1397.57 అడుగుల( 8.93 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా వానల్లేక చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్‌ఫ్లో రాలేదు. అయితే, భారీ వర్షాల కారణంగా ఈ సీజన్‌లో శనివారం అత్యధికంగా 85 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది.
కామారెడ్డి జిల్లాలోని పిట్లం, పెద్దకొడప్ గల్, మనాలలో భారీగా వర్షం పడుతుంది. పిట్లం మండలం కాకి వాగులో ఉద్ధృతంగా వరద ప్రవాహిస్తుండడంతో పిట్లం-తిమ్మానగర్ మధ్య వంతెనపై వరదతో రాకపోకలు నిలిచిపోయ్యాయి. పెద్దకొడప్ గల్ మండలంలో భారీ వర్షంతో పంటలు నీటమునిగాయి. అంతేకాకుండా పిట్లం మండలం కంబాపూర్ లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుకుంది.






