22-10-2025 01:12:06 PM
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో పీహెచ్‌సీ భవనం 'ప్రారంభోత్సవం' వివాదంలో చిక్కుకోవడంతో,పది గ్రామల ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర గందరగోళం నెలకొంది.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వారం క్రితం కొత్త భవనానికి సామాగ్రిని తరలించినా, స్థానిక నాయకత్వం అడ్డుకుని, మంత్రితోనే ప్రారంభం చేయించాలని పట్టుబట్టి తాత్కాలికంగా సేవలను పాత సబ్‌సెంటర్‌కే పరిమితం చేయించింది. బుధవారం మంత్రి వివేక్ పర్యటన,పీహెచ్‌సీ ప్రారంభోత్సవం ఉంటుందని ఆదేశాలు రావడంతో,సిబ్బంది హడావుడిగా ఎక్విప్‌మెంట్‌ను తిరిగి కొత్త భవనానికి తరలించారు.
కానీ, రాత్రికి రాత్రే కార్యక్రమం రద్దయినట్లు సమాచారం రావడంతో బుధవారం ఉదయం వైద్య సేవలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి.సబ్‌సెంటర్‌కు వచ్చిన రోగులకు అక్కడ ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.దిక్కుతోచని స్థితిలో సిబ్బంది తాత్కాలికంగా రెండు కుర్చీలు, కొన్ని మందులతో సబ్‌సెంటర్ కిందే సేవలు అందించే ప్రయత్నం చేశారు. సెలైన్ స్టాండ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేకుండా సేవలు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.తాత్కాలికంగానైనా కొత్త భవనంలో వైద్య సేవలను వెంటనే కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.నాయకుల ఆకాంక్షల మధ్య వ్యవస్థ నలగడంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు.