27-10-2025 05:20:37 PM
రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల..
నకిరేకల్ (విజయక్రాంతి): ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కాపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల డిమాండ్ చేశారు. సోమవారం నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాలలో రైతు సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలంటే కేంద్రం కాపాస్ యాప్ లో రైతు పంట తదితర వివరాలు నమోదు చేయని పక్షంలో కొనుగోలు కేంద్రాలలో పత్తిని కొనుగోలు చేయమని నిబంధన సరైనది కాదన్నారు. యాప్ పై అవగాహన లేని రైతులు ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు.
యాప్ నమోదు నిబంధనతో సంబంధం లేకుండా వ్యవసాయ అధికారి చే టోకన్ ద్వారా పత్తి కొనుగోలు చేసే విధంగా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఆకౌంటులో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ఇప్పటికే పత్తి పంట తెగుళ్ల బారినపడి రైతులు నష్టపోయి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెగుళ్లతో పత్తి రంగు మారిందన్న సాకుతో ప్రవేటు వ్యాపారులు రైతాంగాన్ని దగా చేస్తారని, సిసిఐ అధికారులు రంగు మారిన పత్తికి సైతం కనీస మద్దతు ధర చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు చెన్నబోయిన నాగమణి, ఒంటెపాక కృష్ణ, రైతు సంఘం నాయకురాలు గురిజ స్వరూప తదితరులు పాల్గొన్నారు.