19-02-2026 12:34:55 AM
జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్’కు ఘన సన్మానం
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సిపిఐ 23 దివిజన్లతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మేయర్గా ఎన్నికైన మూడ్ గణేష్ను, కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పర్యవేక్షణ, సూచనలతో పార్టీ అభ్యర్థుల గెలుపుకు నిరంతర కృషి చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషాను ఘనంగా సన్మానించారు.
సిపిఐ, ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇద్దరికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మిక, ప్రజా వర్గాల విశ్వాసానికి ఇది నిదర్శనమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. కొత్తగూడెం అభివృద్ధికి మేయర్, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ విజయం ప్రజా పోరాటాలకు లభించిన గౌరవమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్ వి రమణ మూర్తి, బాజీ సైదా తదితరులు పాల్గొన్నారు.