calender_icon.png 29 July, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకేనా... ప్రభుత్వ నిబంధనలు..?

03-03-2025 08:21:06 PM

పెద్దలు తప్పు చేస్తే శిక్షలుండవా​, చర్యలుండవా..!

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవీంద్రాచారి..

హయత్ నగర్ లోని ముదిరాజ్ కాలనీలో అసైన్డ్ భూముల పరిశీలించిన సీపీఐ నాయకులు... 

ఎల్బీనగర్: ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను అమలు చేసే అధికారులు... ఒకే విధానంతో పని చేయాలని, పేదలతో ఒకరకంగా పెద్దలకు మరోరకంగా వ్యవహరించొద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి సూచించారు. పేదలు, పెద్దలకు వేర్వేరుగా రెవెన్యూ నిబంధనలు లేవని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ మండలంలోని ముదిరాజ్​ కాలనీలోని ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్​ భూములను సోమవారం సీపీఐ పార్టీ ఎల్బీనగర్​ కన్వీనర్​ సామిడి శేఖర్​ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రవీంద్రాచారి మాట్లాడుతూ... హయత్​నగర్​ ఆన్మగల్​ రెవెన్యూ పరిధిలోని 255 సర్వే నెంబర్ లో ఉన్న 75 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.

కానీ, అసైన్డ్ భూమిని పొందిన రైతులు తమ ఆర్ధిక అవసరాలకు 40 నుంచి 70 గజాల చొప్పున భూమిని ఇతరులకు విక్రయించినట్లు తెలిపారు. ఆ స్థలాలను కొనుగోలు చేసినవారిని తమ ప్లాట్ల దగ్గరికి వెళ్లనివ్వకపోవడం దారుణమన్నారు.  ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన పేదలను తమ స్థలాల్లోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అదే సర్వే నెంబర్​లో ఉన్న ప్రభుత్వ భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు కబ్జాలు చేసి ఇండ్లు నిర్మిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. పేదలకు, పెద్దలకు రెవెన్యూ చట్టం ఒకవిధంగానే పనిచేయాలని సూచించారు.

హెచ్​ఎండీఏకి అప్పగించిన భూమిని క్యాన్సల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇప్పటికైనా పేదలకు ప్లాట్లు అప్పగించాలని రెవెన్యూ అధికారులను కోరారు. సుమారుగా 200 మంది పేదలు అసైన్డ్​దారుల వద్ద స్థలాలను కొనుగోలు చేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపారు.   కార్యక్రమంలో సీపీఐ ఎల్బీనగర్​ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాతారాజు నర్సింహ, హయత్ నగర్ డివిజన్ కార్యదర్శి రమావత్ సక్రు నాయక్, మండల కార్యదర్శి శ్రీదేవి, సహయ కార్యదర్శులు శోభన్, అరుణ్, కౌన్సిల్ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.