30 April, 2026 | 3:39 AM

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

30-04-2026 02:29 AM

కలెక్టర్ కె.హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జిల్లాలో గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులకు ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలపై నిఘా పెంచి, సంబంధితులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

గంజాయి వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, నేరాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అలాగే ఆటో, బస్సు డ్రైవర్లు, కూలీలకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు కట్టుదిట్టం చేయాలని, మెడికల్ షాపుల్లో అధిక మోతాదు మందుల విక్రయాలపై పర్యవేక్షణ పెంచాలని చెప్పారు. మత్తు రహిత, ఆరోగ్యకర జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఆధార్ కార్డు ల జారీ పై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ హరిత మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కలిగి ఉండాలని, ముఖ్యంగా 05 సంవత్సరాల పిల్లలకు నమోదు చేయాలని సూచించారు.

జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోలేదని, పోటీ పరీక్షల్లో బయోమెట్రిక్ హాజరు కోసం అప్డేట్ అవసరమని చెప్పారు. పుట్టిన తేదీ నమోదు సమయంలోనే ఆధార్ అనుసంధానం చేయాలని, పీవీటీజీ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న 87 ఆధార్ నమోదు కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మాట్, అడిషనల్ ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తదితర అధికారులు పాల్గొన్నారు.