18-04-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్,ఏప్రిల్ 17(విజయ క్రాంతి): వడ్డించే వాడు మన వాడు అయితే ఏ బంతిలో కూర్చున్న కడుపు నిండ తినొచ్చు.. అనే చందంగా మారింది దుండిగల్ - గండిమైసమ్మ రెవెన్యూ అధికారుల తీరు.అధికారుల సహకారం ఉంటే ఎక్కడైనా ఎలా అయిన అక్రమాలకు పాల్పపడొచ్చు అని అంటున్నారు దుండిగల్ - గండిమైసమ్మ మండలంలోని స్థానికులు.
బిక్కు బిక్కుమంటూ కబ్జాలకు పాల్పడే ఆక్రమణదారులు ప్రభుత్వ స్థలాల్లో ఏకంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు అంటే అర్ధం కాదా..! సహకరించే వారు ఉంటే ఎలాగైనా ఆక్రమణలు చేసుకోవచ్చు, ఎలాగైనా బరితెగించొచ్చు అని.
ఇక వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ - గండిమైసమ్మ మండ లంలోని సర్వే నంబర్ 120 లోని ప్రభుత్వ స్థలంలో వెలిసే అక్రమ నిర్మాణాలు అధికారుల సహకారం లేకుండానే సాగుతున్నా యా అని? అదే సర్వే నెంబర్ 120 లో 60 గజాలలో,80 గజాలలో నిర్మించే చిన్న చిన్న నిర్మాణాలు పై కొరడా ఝులిపించే అధికారులు ఈ మంగళవారం జరిగిన కూల్చివేతల్లో కూడా ప్రత్యేకించి వాటిపైనే కొరడా ఝలిపించడం అధికారుల పరోక్ష సహకారం తేటతెల్లం అవుతోంది. వాటితో పోలిస్తే బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల కంటికి ఎందుకు కనబడడం లేదు అని స్థానికంగా వెళ్ళువెత్తుతున్న ప్రశ్నలు.
ఇష్టారీతిన ఆక్రమణలు...
అయితే కొందరు ఆక్రమణదారులు మాత్రం పట్టాలు ఉన్నాయంటూ, జీవో 58,59 లో రెగ్యులరైజ్ అయ్యాయంటు, మరికొందరు పట్టాలు సృష్టించి మరి ప్రభు త్వ స్థలాన్ని చెరబడుతున్నారని ఆరోపణలు బాగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కొందరు అధికార పార్టీ కి చెందిన చోటా నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలకు పాల్పడడం గమనార్హం.
ఏది ఏమైనాప్పటికీ అధికారుల సహకారంతోనే ఈ తంతు అంతా జరుగుతుందని సదరు నిర్మాణాలకు మున్సిపల్, రెవెన్యూ నుండి ఎలాంటి అనుమతులు ఉండవని అన్నీ తెలిసిన అధికారుల చర్యలు కూడా ఉండవని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభు త్వ భూముల్లో నిర్మాణం చేపట్టడానికి మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారా అనే కోణంలో రెవెన్యూ అధికారులు ఆ నిర్మాణాలపై విచారణ చేపడితే ఆక్రమాలపై నిజానిజాలు బయటపడతాయని స్థాని కులు అభిప్రాయపడుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం: ఎమ్మార్వో సయ్యద్ మతిన్
గండి మైసమ్మ దుండిగల్ మండలంలోని సర్వే నంబర్ 120 లలో వెలుస్తున్న నిర్మాణాలపై ఎమ్మార్వో మతన్ ని వివరణ అడగగా ‘ సదరు నిర్మాణాలకు రెవెన్యూ నుండి ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని, వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలు అని తేలితే మళ్లీ పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో తెలిపారు.