21-08-2025 04:54:18 PM
పింఛన్లు పెంచు తాడో, దిగిపోతాడో సీఎం రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి..
ప్రతిపక్ష హోదా నుంచి కేసీఆర్ తప్పుకోవాలి..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ డిమాండ్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): వికలాంగుల, వితంతువుల, వృద్ధుల ఫించన్లు పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేటికి 20 నెలలు దాటిన ఫించన్ల పెంపుపై నోరు మెదపకపోవడం అమానుషమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత మందకృష్ణ మాదిగ(MRPS founder Manda Krishna Madiga) అన్నారు. గురువారం ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి కళావేదికలో నిర్వహించిన ఫించన్ దారుల సన్నాహక సభకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫించన్ల పెంచడంపై మాటతప్పిన రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకు సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో వికలాంగుల, వితంతువుల, ఒంటరి మహిళల, వృద్ధులతో యుద్ధ భేరి సభను నిర్వహిస్తున్నట్టు మందకృష్ణ చెప్పారు.
ఎన్నికల లకు ముందు ఫించన్లు పెంచుతామని ఎన్నికల్లో పోటీ చేసిన కేసీఆర్ ను ప్రజలు ఓడగొట్టి ప్రతిపక్షానికి పరిమితం చేశారని అన్నారు. పింఛన్ల పెంపు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అధికారం లోకి వచ్చిన వెంటనే ఫించన్లు పెంచుతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి 20 నెలలు గా ఫించన్లు పెంచకుండా 20 వేల కోట్ల రూపాయల పింఛన్ల డబ్బును భూమి ఉన్న రైతాంగానికి ఇచ్చి ఫించన్ తో జీవనం సాగించే నిరుపేదల ను మోసం చేశారని మంద కృష్ణ ఆరోపించారు.అసెంబ్లీ కి వచ్చి అడుగ డు,బయటికి వచ్చి పోరాడడు ఫాంహౌస్ కేసీఆర్ పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. పింఛన్ల భారీ సభలో రేవంత్ పదవి నుంచి తప్పు కుంటాడో, ఫించన్లు పెంచుతాడో తేలిపోతుందని విమర్శించారు. ఆదినుంచి ఫించన్ ల పెరుగుదల కోసం పాలకుల పై పోరాడింది ఎమ్మార్పీఎస్ మాత్రమేనని ప్రకటించారు.
నేడు కూడా ఫించన్లు పెంచుకునేందుకు హైదరాబాద్ లోని సభ దోహద పడుతుందని ఈ సభకు భారీ సంఖ్యలో వృద్ధులు,వికలాంగులు,వితంతువులు తరలిరావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.ఇప్పటి వరకు 33 జిల్లా ల్లో,అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో సన్నాహక సభల్లో తాను పాల్గొని ఫించన్ దారులను సన్నద్ధం చేస్తున్నట్లు మందకృష్ణ స్పష్టం చేశారు. పింఛన్ల పెరుగు దల పై పాలక ప్రతిపక్ష పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని మందకృష్ణ హితవు పలికారు. ఈ సమావేశానికి ఏ డీ ఏ ఎల్తూరి సురేఖ,ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్,ఎమ్మార్పీఎస్ సీనియర్ రాష్ట్ర నాయకుడు దాసారపు ఎల్లయ్య,జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, పెద్ద సంఖ్యలో వికలాంగులు,ఫించన్ దారులు హాజరయ్యారు.