calender_icon.png 21 August, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 23న చేపట్టనున్న ఉపాధ్యాయుల మహాధర్నాను విజయవంతం చేయాలి

21-08-2025 04:35:35 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో చేపట్టే మహాధర్నాను ఉపాధ్యాయులందరూ విజయవంతం చేయాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుండారపు చక్రపాణి(TS UTF District President Gundarapu Chakrapani), ప్రధాన కార్యదర్శులు రాజా వేణు కోరారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలను అమలుపరచడం లేదని విమర్శించారు. వెంటనే పీఆర్సి ని అమలు చేసి, పెండింగ్ డిఏలను విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రూపొందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు 5571 పిఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, డీఎడ్, బిఎడ్ అర్హతలు ఉన్న ఎస్జీటీకి పిఎస్ హెచ్ఎం ప్రమోషన్లను కల్పించాలని కోరారు.

పండిత్, పీఈటీల అప్క్రదేశం ప్రక్రియ పూర్తయినందున జీవో 2,3,9,10 లను రద్దుచేసి జీవో 11,12 ల ప్రకారం పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయుల సర్దుబాటు మార్గదర్శకాలను సవరించాలని కోరారు వివిధ జిల్లాలలో జరిగిన పైరవీ డిప్యూషన్లను వెంటనే రద్దు చేయాలని, గురుకుల టైం టేబుల్ సవరించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం దశల వారి ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. జూలై 23, 24, 25 తేదీలలో మండల తాసిల్దార్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాలు సమర్పించామని, రెండవ దశలో ఆగస్టు 5న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి కలెక్టర్ల ద్వారా వినతి పత్రాలు కూడా అందజేశామని అయినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనివార్య పరిస్థితులలో ఈనెల 23న హైదరాబాదులో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.