15 June, 2026 | 2:21 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

అమ్మా.. వనదుర్గమ్మా.. చల్లంగా చూడమ్మా

14-12-2025 03:16 PM

ఆదివారం భక్తులతో జనసంద్రమైన ఏడుపాయల క్షేత్రం

వనదుర్గమ్మకు పలు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

మంజీరాలో పుణ్య స్నానమాచరించి అమ్మ దర్శనానికి బారులు

విజయక్రాంతి,పాపన్నపేట: ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామనిపించే వాతావరణం.. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం సొంతం.  ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయల భక్తులతో జనసంద్రంమైంది. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసాయి. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలు, సారెతో అందంగా అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు. వెండి కళ్ళు, కిరీటం, హారంతో అమ్మవారు భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. చెక్ డ్యామ్, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీ పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల్ల మధ్య బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.