30-12-2025 12:02:53 AM
భర్తపై డ్రగ్స్, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి
డిజిటల్ అరెస్టు పేరుతో హైదరాబాద్ మహిళను బెదిరించిన గుజరాత్ నిందితులు
భయంతో అడిగినంత ఇచ్చిన బాధితురాలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
దేశవ్యాప్తంగా 22 కేసులతో లింకులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): డిజిటల్ అరెస్టు చేస్తామం టూ గుజరాత్‌కు చెందిన ఓ ముఠా హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు వీడియో కాల్ చేసి బెదిరించి, రూ.1.95 కోట్లను దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలతో గుజరాత్‌కు చెందిన ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ప్రధాన నిందితులు సయ్యద్ సోయబ్ జాహిద్, బెలిమ్ అనస్ రహీం మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫోన్ చేసిన కేటుగాళ్లు.. తాము టెలికాం విభాగం, పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులమని పరిచయం చేసుకున్నారు.
మీ భర్త పేరుతో ఒక పార్శిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. ఆయనపై మనీలాండరింగ్ కేసులు కూడా నమోదయ్యాయి అంటూ బెదిరించారు. స్కైప్, వాట్సప్ వీడియో కాల్ చేసి.. వెనుక పోలీస్ స్టేషన్ సెటప్, యూనిఫాంలో ఉన్నట్లు నమ్మించి ఆమెను డిజిటల్ అరెస్టు చేశారు. మేము విచారణ చేస్తున్నాం, మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు, వీడి యో కాల్ కట్ చేయకూడదు అని హుకుం జారీ చేశారు. అరెస్ట్ చేస్తామని భయపెట్టడం తో, ఆందోళనకు గురైన బాధితురాలు వారి నుంచి బయటపడేందుకు వారు చెప్పినట్లు చేసింది. కేసు మాఫీ చేస్తామని, విచారణ కోసం డబ్బు డిపాజిట్ చేయాలని నమ్మించి ఆమె నుంచి దఫదఫాలుగా రూ.1.95 కోట్ల ను ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయించుకున్నారు.
చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిం చింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ ఖాతాల ఆధారంగా దర్యా ప్తు చేపట్టారు. నిందితులు అమాయకుల పేర్ల తో తెరిచిన మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ నగదును మళ్లించినట్లు గుర్తించారు. గుజరాత్‌లో వీరి కదలికలను పసిగట్టి అదుపు లోకి తీసుకున్నారు. వీరి బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించగా.. కేవలం కొద్ది రోజుల్లోనే రూ.3.5 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు తేలింది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన 22 సైబర్ క్రైమ్ కేసుల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.