05-07-2025 02:12:54 AM
జూలై నుంచే అమల్లోకి
న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు అందనుంది. జూలై 2025 నుంచి కరువు భత్యం (డీఏ) 4 శాతం మేర పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల ద్రవ్యోల్పణ గణాంకాల ఆధారంగా ఈ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 59 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జూలై నుంచి అమల్లోకి రానుంది. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో.. పండుగ సీజన్‌కు డీఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
డీఏ లెక్కింపునకు ఆధారమైన ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (ఐఐసీపీఐ డబ్ల్యూ) 2025 మేలో 0.5 పాయింట్లు పెరిగి 144కు చేరింది. గత మూడు నెలల్లో సూచీ స్థిరమైన పెరుగుదలను చూపించింది. ఇది మార్చిలో 143, ఏప్రిల్‌లో 143.5, మేలో 144గా ఉంది. ఇండెక్స్ ఇదే జోరును కొనసాగించి జూన్‌లో 144.5కు పెరిగితే ఏఐసీపీఐ 12 నెలల సగటు 144.17కు చేరుకుంటుందని అంచనా.
7వ వేతన సంఘం ఫార్ములాను ఉపయోగించి డీఏను సర్దుబాటు చేసినప్పుడు ఇది సుమారు 58.85% రేటుగా మారుతంది. దీంతో 2025 జూలై నుంచి 59 శాతం డీఏకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశముంది. సాధారణంగా డీఏ పెంపు జూలై నుంచి అమల్లోకి వస్తుంది.
అయితే ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయం సెప్టెంబర్ సమయాల్లో తీసుకుంటుంది. అప్పుడు పండగల సీజన్ కొనసాగుతుంది. డీఏ పెంపుతో కలిపి ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు అందుతాయి. ఈసారి కూడా అదే జరిగే అవకాశముంది. అంచనా ప్రకారం దీపావళి సమయంలోనే డీఏ పెంపు ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.