05-07-2025 06:09:50 PM
చంద్రబాబు కోవర్టులని వాళ్లనే అన్నాను..
నా మాటలను వక్రీకరిస్తే సహించేది లేదు
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
జడ్చర్ల: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు కోవర్ట్ లు తెలంగాణలో ఉన్నారని తాను చేసిన వాఖ్యలు కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే తాను చెప్పానని, నాయకులను గురించి తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampally Anirudh Reddy) స్పష్టం చేశారు. ఈ విషయంగా తనకు సంబంధించిన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు తాను నాయకుల ఉద్దేశించి కోవర్టులంటూ మాట్లాడానని తప్పుడు ప్రచారం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారని, వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్ద రోడ్డు కాంట్రాక్టర్లు, హైదరాబాదులో దండాలు చేస్తున్నారని వారిని టైట్ చేస్తే వారే వెళ్లి చంద్రబాబునాయుడి కాళ్లు పట్టుకొని బనకచర్ల ప్రాజెక్టు ఆపుతారని మాత్రమే తాను చెప్పానని, ఇంకా కూడా తాను ఏ నాయకుడు గురించి మాట్లాడలేదని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి చెప్పారు. మీడియాకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అయితే కేటీఆర్ తో సహా కొంతమంది విపక్ష నాయకులు తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు కోవర్ట్ అని తాను సీఎం రేవంత్ రెడ్డిని పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు చెప్పడం పట్ల ఆయన ఆక్షేపణ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి టిడిపి నుంచి వచ్చిన కారణంగా చంద్రబాబు నాయుడు కోవర్ట్ అయితే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా టిడిపి నుంచి వచ్చారనే విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలని మరి ఆయనను కూడా చంద్రబాబు నాయుడు కోవర్టుగా పరిగణించాలా అని ప్రశ్నించారు. ఈ విషయంగా తాను చేసిన వీడియోను చూసి ఆ తర్వాతే దాని గురించి మాట్లాడాలని తన వీడియోను చూడకుండా మాట్లాడడం సబబు కాదని ఆయన హితపు చెప్పారు. తాను కేవలం కాంట్రాక్టర్ల గురించే మాట్లాడానని చంద్రబాబు కోవర్టులని వాళ్లని మాత్రమే అన్నానని నాయకుల గురించి ఎక్కడ మాట్లాడలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదంలో సీఎంను లాగకండి అని ఆయన కోరారు. ఈ వీడియోను చూడకుండా తప్పుడు వ్యాఖ్యానాలను చేస్తే సహించేదే లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.