25-07-2025 12:23:14 PM
తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మెయిన్ రోడ్డు(Thungathurthi Main Road) బస్టాండ్ నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు గల రహదారి గత కొంతకాలంగా పెద్ద పెద్ద గుంతలు పడి, ప్రమాదాలకు నిలయంగా మారింది. అసలు రహదారిపై గుంతలు పడడానికి కారణం మద్దిరాల మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కు నూతన రహదారి, టెండర్ రావడంతో, తన సొంత క్రషర్ మిషన్ నుండి తన సొంత ప్రైవేటు పెద్ద పెద్ద టిప్పర్లతో, ఓవర్ లోడ్ తో ఈ రహదారిపై ఎక్కువగా తిరగడంతో, తారు రోడ్డు కుంగి, పెద్దపెద్ద గుంతలగా మారింది. కానీ సంబంధిత అధికారులు ఏనాడు పాపాన రహదారిని చూడలేకపోయారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో గుంతలు నీటితో మునిగి వాహనదారులకు కష్టాలుగా మారింది. గతంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగి గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు పరిశీలించి, మరమ్మత్తులు నిర్వహించాలని, వాహనదారులు ,గ్రామస్తులు కోరుతున్నారు.