9 July, 2026 | 1:47 AM

ట్రాఫిక్ రద్దీ నివారణకు డేటా ఆధారిత సర్వేలు చేపట్టాలి

09-07-2026 12:44 AM

జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

శేరిలింగంపల్లి, జూలై 8 (విజయక్రాంతి): సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీని అరికట్టడానికి సమగ్ర డేటా ఆధారిత సర్వేలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. శేరిలింగంపల్లి ట్రాఫిక్ జోన్ ఎస్హెచ్వోలతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ఐటీ కంపెనీల నుంచి వచ్చే వాహనాల రాకపోకలపై వారం రోజుల పాటు రోజువారీ వాహనాల లెక్కింపు చేపట్టాలని సూచించారు.

పీక్ అవర్స్లో ట్రాఫిక్ తీవ్రత, వాహనాల వర్గీకరణ,రహదారుల సామర్థ్యం,కార్పూలింగ్ ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.అలాగే ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాల పనితీరు,జియో-ట్యాగింగ్,సిగ్నల్స్ నిర్వహణ,షాపింగ్ మాల్స్,హాస్పిటల్స్, విద్యాసంస్థల వద్ద ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో శేరిలింగంపల్లి ట్రాఫిక్ డీసీపీ రవికుమార్, అడిషనల్ డీసీపీలు హనుమంతరావు, నరేందర్, ఎస్సీఎస్ సీఈఓ నవేద్ తదితరులు పాల్గొన్నారు.