9 July, 2026 | 1:24 AM

రూ.300కోట్లతో ఆయిల్‌పామ్ ప్రాజెక్టు

09-07-2026 12:44 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డితో గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధుల భేటీ   
  2. ఆయిల్‌పామ్ విస్తరణ, ప్రాజెక్టుపై చర్చలు
  3.  113.5 ఎకరాల భూమి అప్పగించిన ప్రభుత్వం  

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్‌పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి, ఇతర ప్రతినిధులు బుధవా రం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో భేటీ అయ్యారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రూ.300 కోట్ల పెట్టుబడితో ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్‌పామ్ ప్రాజెక్టుపై చర్చించారు.

ఇందుకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్, నర్సీరీ, ఆర్‌అండ్‌డి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని ప్రభుత్వం గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు కేటాయించింది.

అలాగే సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎకరాల భూమి కేటాయించాలని, ప్రాసెసింగ్ మిల్ కోసం రహదారిని విస్తరించాలని ముఖ్యమంత్రిని సంస్థ ప్రతినిధులు కోరారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. 700 మందికిపైగా ఉపాధి లభించనుంది. 

సీఎంను కలిసి మలేషియా ఎంపీ

సీఎం రేవంత్‌రెడ్డితో మలేషియా పార్లమెం ట్ సభ్యుడు శరవణన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ -2026లో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన శరవణన్ మరికొందరు అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి సీఎంను కలిశారు. పర్యావరణం, సామాజిక, పరిపాలన పరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగం, భవిష్యత్తు పెట్టుబడులపై చర్చించారు. సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.