17 April, 2026 | 12:51 PM

కొత్తవారికే డీసీసీ చాన్స్!

15-10-2025 01:06 AM
  1. ఇప్పుడున్న అధ్యక్షులకు రెండోసారి అవకాశం లేదు
  2. ప్రజాప్రతినిధుల బంధులూ అనర్హులే..
  3. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీలకు అవకాశం
  4. ఏఐసీసీ పరిశీలకులు, పార్టీ నేతలకు మీనాక్షి సూచనలు 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్య క్ష పదవులు కొత్త వారికే ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకునే వారు కనీసం ఐదేళ్ల పాటు నిరంతరం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసి ఉండాలని నిబంధన పెట్టింది. పార్టీ నిబంధనలకు అనుగుణంగా లేని వారు దరఖాస్తు చేస్తే.. వారిని ఏఐసీసీ పరిశీలకులే తొలగిస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ తెలిపారు.

మంగళ వారం డీసీసీ అధ్యక్షుల నియామకాలపై జరుగుతున్న సమావేశాలపై ఏఐసీసీ పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులతో మంగళవారం మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ జూమ్ మీటింగ్‌లో డీసీసీ అధ్యక్షులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే , ఏఐసీసీ ఆర్గనైజేషన్ ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్  ఆదేశాలను ప్రతి ఒక్కరు పా టించాలన్నారు.

ఇప్పుడు పని చేస్తున్న డీసీసీ అధ్యక్షులకు రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని, పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధుల దగ్గరి బంధువులకు కూడా అనర్హులేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నాయకులకు ప్రాధాన్యత ఉంటుందని, పదవుల్లో 50 శాతం వరరకు ఉండాలని మీనాక్షనటరాజన్ సూచించారు. ఏఐసీసీ పరిశీలకులతో ఏ నాయకుడు కూడా వ్యక్తిగత సంభాషణలు, సమావేశాలు నిర్వహించొద్దని హెచ్చరించారు.

జిల్లాలోని సమావేశాలను అక్కడి నాయకుల ఇళ్లల్లో, వారి స్వంత కార్యాలయాల్లో నిర్వహించొద్దని, పార్టీ కార్యాల యంలో కానీ లేదా అందరికీ అందుబాటు లో ఉండే ప్రాంతంలో కానీ నిర్వహించాలన్నారు. అలాగే ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓట్ చోరీ కార్యక్రమంలో గ్రామంలో కనీసం వంద మంది సంతకాలు చేయించి పంపించాలని సూచించారు.