15-10-2025 01:05:18 AM
గర్భందాల్చడంతో పాలమాకులలో ఆర్‌ఎంపీతో అబార్షన్
చికిత్స వికటించి యువతి మృతి
హోంగార్డ్ మధుసూదన్, ఆర్‌ఎంపీ పద్మజా అరెస్టు
రంగారెడ్డి జిల్లా పాలమాకులలో దారుణం
రాజేంద్రనగర్, అక్టోబర్ 14: ప్రేమ పేరుతో ఓ యువతికి దగ్గరైన హోంగార్డ్ ఆమెతో సహజీవనం చేశాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించే క్రమంలో వైద్యం వికటించి యువతి మృతి చెందింది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకులలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరక్‌నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన బ్యాగరీ మౌనిక(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అవుతున్నది. శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామానికి చెందిన హోంగార్డు మధుసూదన్..
శంషాబా ద్ ఫింగర్ ప్రింట్ టీంలో పనిచేస్తున్నాడు. అయితే ప్రే మిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ ఏడేళ్ల నుంచి మౌనికతో మధుసూదన్ సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో మౌనిక నాలుగు నెలల క్రితం గర్భం దాల్చింది. దీంతో మధుసూదన్ గుట్టుచప్పుడు కాకుండా గర్భవిచ్ఛిత్తి కోసం శంషాబాద్ మండలం పాలమాకులలో ఎలాంటి అనుభవం లేని ఆర్‌ఎంపీ పద్మజను సంప్రదించాడు.
పద్మజ మౌనికకు అబార్షన్ చేయగా.. తీవ్ర రక్తస్రావమై ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ మౌనిక చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి తల్లి బ్యాగరీ జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుసూదన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మధుసూదన్‌తోపాటు ఆర్‌ఎంపీ పద్మజను అరెస్టు చేశారు.