05-12-2025 10:49:25 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోడ్‌పై ప్రజలకు అవగాహనలి పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి
మంథని,(విజయక్రాంతి): స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇతరుల మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి డిసిపి రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల కోడ్ పై అవగాహన సదస్సులో భాగంగా మంథని మండలంలోని చిన్న ఓదెల, గోపాలపూర్, రచ్చపల్లి, గుంజపడుగు తదితర గ్రామాలలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తో కలిసి ప్రజలకు అవగాహన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొవాలని, స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి ప్రజలు పోలీస్ లకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ పోలింగ్ రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని,
నిషేధిత చర్యలు, డబ్బు మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు జరుగుతే వెంటనే డయాల్ 100 కు స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డీసీపీ వెంట మంథని సీఐ రాజు, మంథని ఎస్ఐ లు డేగ రమేష్, సాగర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.