05-12-2025 10:39:57 PM
చివ్వేంల,(విజయక్రాంతి): చివ్వేంల మండల పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని చివ్వేంల ఎస్‌ఐ వి.మహేశ్వర్ సూచించారు. సర్పంచి, వార్డు అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా క్రమశిక్షణతో వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత విమర్శలు, ఒకరి మీద ఒకరు ప్రత్యక్ష ఆరోపణలు, వాదనలు, ఘర్షణలకు దారితీసే చర్యలు పూర్తిగా నివారించాలని ఆయన పేర్కొన్నారు.
“ఎన్నికల బరిలో అందరూ మన గ్రామస్థులే… పరస్పర విభేదాలు సృష్టించే మాటలు, చర్యలు చేయకూడదు” అని సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద అమలులో ఉండే 100 నుంచి 200 మీటర్ల పరిధి ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలి, ఎలాంటి గుంపులు, ప్రచారం, ప్రదర్శనలు నిషేధమని హెచ్చరించారు.
ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నామని, ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు అనుమతించబోవడం లేదని, ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాణాసంచా పేల్చడం, డిజే లు వినియోగించడం కూడా పూర్తిగా నిషేధమని తెలియజేశారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లయితే అభ్యర్థులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్‌ఐ వి. మహేశ్వర్ హెచ్చరించారు.