05-12-2025 10:52:18 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు జీ.వీ.శ్యాంప్రసాద్ లాల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా, పోచంపాడ్, వేల్పూర్, భీమ్గల్ మండలం జాగిర్యాల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ గ్రామ పంచాయతీలను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. మండల స్థాయి ఎన్నికల నిర్వహణ అధికారులతో నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై చర్చించి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ ను తనిఖీ చేశారు. టీ పోల్ యాప్ లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. వేల్పూర్ లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పనితీరును తనిఖీ జరిపి, పలు సూచనలు చేశారు. అబ్జర్వర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.