calender_icon.png 13 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

03-12-2024 01:38:38 AM

మంత్రి పొంగులేటి ప్రకటన

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రానున్న 10 రోజుల్లో రాష్ట్రంలోని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుడతామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న 10 రోజుల్లో ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మొదటి విడతగా స్థలం ఉండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్థోమత లేని పేదవారికి కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో సొంతిళ్లు లేని వారు ఉండరన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన యాప్‌ను ఈ నెల 5న సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ నెల 6 నుంచి ప్రతి గ్రామానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బృందాలు వెళ్లి నిరుపేదలను మొదటి విడతలో లబ్ధిదారులుగా  ఎంపిక చేస్తాయని చెప్పారు. ప్రభుత్వం మొదటి విడతగా రాష్ట్రంలో 4లక్షల 50వేల ఇండ్లను మంజూరు చేస్తుందని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత వాటిని వదిలేసి కేవలం అభివృద్ధి వైపు మాత్రమే దృష్టి పెట్టి పని చేయాలన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని, అందుకే అన్ని హామిలను ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు.

రూ.2,800 కోట్లను రుణమాఫీ కోసం విడుదల చేశామని చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు. కాగా సింగ్యతండా నుంచి గొల్లగూడెం, ఎర్రాయిగూడెం నుంచి చింతలకట్ట, దాసుతండా నుంచి ఎర్రబోడు, బొడ్డుగూడెం పంచాయతీ రోడ్డు నుంచి బంగారంవల్లి వయా బర్లగూడెం వరకు, పెద్దచర్లపల్లి నుంచి గంగారం నుంచి ఉలవచలక వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

గంగారంలోని గిరిజన బాలుర వసతిగృహన్ని మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన దరఖాస్తులను మంత్రి స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని టేకులపల్లి తహసీల్దార్ భవానిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే  కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహూల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం ఆర్డీవో మధు, ఆర్‌అండ్‌బి ఈఈ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌నాయక్, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి లెనీనా, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నళిని పాల్గొన్నారు.