9 April, 2026 | 2:42 AM

డెకాయిట్ బ్లాక్‌బస్టరే.. డౌట్ లేదు!

09-04-2026 12:00 AM

అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్- రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ వేడుకకు సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ ముఖ్యఅతిథిగా, హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరో సుమంత్ అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ డైరెక్టర్లు రాహుల్ రవీంద్ర, కార్తీక్ ఘట్టమనేని, శౌర్యువ్, శశికిరణ్ తిక్క, డైరెక్టర్ సాయి మార్తాండ్, నిర్మాతలు సురేశ్‌బాబు, రవిశంకర్, దామోదర్ ప్రసాద్, నాగవంశీ, స్వప్న దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. “కొన్ని సినిమాలు మొదలైనప్పుడే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. శేష్‌ను ‘పంజా’లో చూశా.

అప్పుడే తను చాలా అద్భుతమైన నటుడు అవుతాడనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయి. మరిన్ని బ్లాక్‌బస్టర్ రావాలని కోరుకుంటున్నా. డెకాయిట్  కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఒక లవ్‌స్టోరీలో ఇలాంటి యాక్షన్ ఉండటం చాలా కొత్తగా ఉంది” అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మేము సినిమాను ఎంత ప్రేమించామో ఏప్రిల్ 10న థియేటర్లలో చూస్తారు. మృణాల్ క్యారెక్టర్ పిచ్చెక్కిస్తుంది. ఇంటర్వెల్‌లో తనే హైలెట్‌” అని తెలిపారు.

కథానాయకి మృణాల్ ఠాగూర్ మాట్లాడుతూ.. “కథ విన్నాక చాలా నచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. శేష్‌తో కలిసి పనిచేయడం అద్భుత అనుభూతినిచ్చింది. వెంకటేశ్ ఎదురుగా నిలబడి మాట్లాడటం ఒక గౌరవంగా భావిస్తున్నా” అని చెప్పింది.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. “నాన్న ఎస్‌ఎస్ క్రియేషన్స్ అనే బ్యానర్ మంచి సినిమా తీయాలని ఉండేది. అందుకే ‘డెకాయిట్’ ప్రారంభించా. మా అన్నయ్య సుమంత్ ఈ సినిమాకు సైలెంట్ ప్రొడ్యూసర్‌” అని తెలిపారు. సంగీత దర్శకుడు భీమ్స్, రైటర్ అబ్బూరి రవి, డీవోపీ ధనుష్ భాస్కర్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.