calender_icon.png 1 November, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్లీపర్ బస్సుల్లో లోపాలు!

25-10-2025 12:00:00 AM

కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు పెను విషాదాన్ని నిం పింది.ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో డ్రైవర్ అజాగ్రత్త చర్యతో ముందు వెళ్తున్న బైక్‌ను బస్సు బలంగా ఢీకొట్టడం, ఆపై బైక్ ను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో పెట్రోల్ లీకయ్యి క్షణాల్లో బస్సుకు మంటలు అంటుకున్నాయి.

ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవ ర్లు సహా 41 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది సజీవదహనమవ్వగా.. బైక్ నడిపిన వ్యక్తి కూడా మరణించడం బాధాకరం. పది రోజుల క్రితం రాజస్థాన్‌లో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదమే చోటుచేసుకుంది. స్లీపర్ బస్సుకు మంటలు అంటుకోవడం, మెయిన్ డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. దీంతో ప్రమాదం లో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

కొన్నేళ్ల నుంచి స్లీపర్ బస్సు ల్లో ఇలాంటి అగ్నిప్రమాద ఘటనలు భారీగా ప్రాణనష్టాన్ని మిగుల్చుతున్నాయి. వాస్తవానికి స్లీపర్ బస్సుల డిజైన్‌లో లోపాలు చాలానే ఉన్నాయి. స్లీపర్ బస్సుల్లో రెండు స్థాయిల్లో బెర్తులు ఉండడంతో ఎత్తు ఎక్కువగా ఉండి సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల బస్సు కు స్థిరత్వం తగ్గి ఎక్కువ వేగంగా వెళ్లినా, అకస్మాత్తుగా బ్రేక్ వేసినా ఒకవైపుకు పడిపోయే ప్రమాదముంది.

ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో లోపలి క్యాబిన్ చాలా ఇరుకుగా ఉంటుంది. దాదాపు 30 నుంచి 36 బెర్తులు ఉం టాయి. ఒక్కో బెర్త్ ఆరడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పుతో ఉంటుం ది. దీనివల్ల మెయిన్ డోర్ నుంచి ఒక్క వ్యక్తికి మాత్రమే నడిచేందుకు వీలుంటుంది. ఇలాంటి అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్‌లు జరిగినప్పుడు 7 నుంచి 8 అడుగుల ఎత్తులో ఉండే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడడం కూడా కష్టతరమే.

ఇక స్లీపర్ బస్సుల్లో దిండ్లు, పరుపులు, దుప్పట్లు, కర్టెన్లకు మండే స్వభావం ఎక్కువ. మంటలు చెలరేగిన కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించేందుకు ఇవి దోహదపడుతాయి. ఎయిర్ కండిషన్డ్ డిజైన్ వల్ల స్లీపర్ బస్సులకు కిటికీలు ఉండకపోవడంతో పొగ మొత్తం కంపార్ట్‌మెంట్‌లోకి వేగంగా నిండుతుంది. ప్రపంచవ్యాప్తంగానూ స్లీపర్ బస్సులు అనేకసార్లు ప్రమాదాలకు గురయ్యాయి.

చైనాలో 2009 తర్వా త 13 స్లీపర్ బస్సు ప్రమా దాలు జరగ్గా.. ఏకంగా 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2021 లో స్లీపర్ బస్సులపై చైనా నిషేధం విధించగా, జర్మనీలోనూ స్లీపర్ బస్సులపై నిషేధం అమల్లో ఉంది. ప్రమాదాల దృ శ్యా కొన్ని దేశాలు స్లీపర్ బస్సులను క్రమంగా తగ్గించుకుంటూ వస్తు న్నాయి. అయితే భారత్‌లో స్లీపర్ బస్సులను బ్యాన్ చేయడానికి బదులు కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఎస్‌ఐ) 119 పేరుతో స్లీపర్ కోచ్‌ల్లో కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలని పేర్కొంది.

దీని ప్రకారం స్లీపర్ బస్సులో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు, ప్రయాణికులకు సరైన బెర్తుల లేఔట్‌లు ఉండాలి. అలాగే బస్సులో మండే స్వభావం లేని వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ నిబంధనలను చాలా ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు తుం గలోకి తొక్కుతున్నాయి. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా బస్సులు నడుపుతూ ప్రాణాలను హరిస్తున్నాయి.