calender_icon.png 31 July, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదు జిల్లాల్లో లోటు వర్షపాతం

31-07-2025 12:35:37 AM

  1. సాధారణం కంటే తక్కువ నమోదు
  2. ఐదు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం
  3. జూలై 30 వరకు 340.2 మి.మీ. వర్షపాతం నమోదు

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): నైరుతి సీజన్ రెండు నెలల్లో ముగియనున్నది. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్, జగిత్యాల, జనగాం, పెద్ద పల్లి, మంచిర్యాల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్లుగా సమాచారం అందింది. జూన్ 1 నుంచి జులై 30 వరకు రాష్ట్రంలో 353.5 మి.మీ. సాధారణ వర్షపాతం ఉండగా 340.2 మి.మీ. వర్షపాతమే  నమోదైంది. 

ఈ ఏడాది రుతుపవనాలు రాక ముందే మొదలైంది. జూన్ మొదటి వారంలోనో అంతకు ముందే రావాల్సిన రుతుపవనాలు మే చివరి వారంలోనే పలుకరించాయి. ఇక ఈ ఏడాది అంతా మంచి వర్షాలు కురుస్తాయన్న ఆశలు జూన్ నెలలో అంతగా వర్షపాతం లేకపోవడం తో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. జూన్‌లో 130 మి.మీ.లకు గాను 104 మి.మీ. మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 20% తక్కువగా నమోదు అయింది.

జూన్ నెలలో పరిశీలిస్తే రాష్ట్రంలో హైదరాబాద్‌లో 29మి.మి నుంచి ఆదిలాబాద్‌లో 209 మి.మి జిల్లాల్లో సాధారణం లోటు వర్షపాతం నమోదైంది. ఇక భూగర్భ జలాలు జూన్ నెలలో సరాసరిలో 0.43 మీ పెరిగాయి. 22 జిల్లాల్లో ప్రధానంగా పెద్దపల్లి నుంచి నాగర్‌కర్నూల్‌లో నీటి మట్టాలు పెరిగాయి. కాగా 11 జిల్లాల్లో ప్రధానంగా సంగారెడ్డి నుంచి యాదాద్రి నీటి మట్టాలు వర్షాలు కురియకపోవడం వల్ల తగ్గాయి. 

నాలుగు జిల్లాల్లో  ఎక్కువ వర్షపాతం

ఇక జూలై నెల మూడో వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదు అయ్యాయి. ప్రధానంగా జూలై నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదు అయ్యాయి. జూన్ 1 నుంచి జులై 30 వరకు పరిశీలిస్తే కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 353.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా జులై 30 వరకు 340.2మి.మీ వర్షపాతం నమోదైంది.

నాలుగు శాతం లోటు వర్షపాతం ఉంది. వర్షపాతం రోజులను పరిశీలిస్తే సరాసరి వర్షపాతం 30రోజులుగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో జూన్ 1 నుంచి జులై 30 వరకు 275.3 మి.మి సాధారణ వర్షపాతం ఉంటే 251.3 మి.మి వర్షపాతంతో 9శాతం లోటు వర్షపాతం నమోదైంది. వివరాలను పరిశీలిస్తే

4 రోజులపాటు వర్షాలు 

రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 3వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో బలమైన ఉపరితల గాలులు గంటకు 30 కి.మీ వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.