8 April, 2026 | 12:16 AM

కార్డుల జాప్యం.. పథకాలకు దూరం

08-12-2024 12:18 AM
  1. రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు
  2. పెండింగ్‌లో వేల దరఖాస్తులు

సిరిసిల్ల, డిసెంబర్ 7 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం కొత్త రేషన్‌కార్డులు జారీ కాకపోవడంతో లబ్ధిదారులు వాటి కోసం ఎదురుచూస్తున్నారు. రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్డులు జారీ ప్రక్రియ చేపట్టకపోవడంతో ప్రజల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 1,73,745 రేషన్ కార్డులుండగా,  ఆహార భద్రత కార్డులు 1,59,854లు, అంత్యోదయ కార్డులు 13,684 లు, అన్నపూర్ణ కార్డులు 207 ఉన్నాయి. 4,97,103 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాగా మార్పులు, చేర్పుల కోసం 20,606 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 40 వేల వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

మండలాల వారిగా కోనరావుపేటలో 1,406, చందుర్తిలో 1,760, బోయినపల్లిలో 1,321, ఇల్లంతకుంటలో 1,760, ముస్తాబాద్‌లో 1,914, గంభీరావుపేటలో 2,125, రుద్రంగిలో 948, వేములవాడలో 2,105, ఎల్లారెడ్డిపేటలో 2,032, వీర్నపల్లిలో 481, తంగళ్లపల్లిలో 1,333, వేములవాడ రూరల్‌లో 1,105, సిరిసిల్లలో 2,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2016లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినా పూర్తి  స్థాయిలో జారీ చేయలేదు. అప్పటి నుంచి కార్డులు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రమాణికంగా రేషన్‌కార్డు మారే అవకాశం ఉండే ఆవకాశాలు ఉన్నాయి. దీంతో రేషన్‌కార్డు లేని పేదలు ఇళ్లు కోల్పోతామేమోనని ఆందోళన చెందుతున్నారు.

గతంలోనూ తెల్ల రేషన్ కార్డులు లేని చాలా మంది డబుల్ బెడ్ రూం ఇళ్లు అందక నష్టపోయారు. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశముంది. రైతు రుణమాఫీ సైతం రేషన్ కార్డులు ఉన్న వారిలో ఒక్కరికి మాత్రమే వర్తించింది. కుటుంబాలు వేరుగా ఉన్నప్పటికీ, గతంలో ఉమ్మడి కుటుంబగా ఉండటంతో పలువురు రైతులు నష్టపోయారు. ఇలా రేషన్ కార్డు లేకపోవడంతతో ప్రభుత్వ ఫలాలు దూరమైయ్యాయి.