గురుకులాల్లో దోమల స్వైర విహారం
జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు
కరీంనగర్, డిసెంబర్ ౭ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని గురుకులాల్లో విద్యార్థు లు జ్వరాల బారిన పడుతున్నారు. గురుకులాల్లో కిటికీలు, తలుపులు లేకపోవడం, దుప్పట్లు అందకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 12 బీసీ, 8 ఎస్సీ, 9 మైనార్టీ, ఒక గిరిజన గురుకులాలు ఉన్నాయి.
మొత్తం 30 గురుకుల పాఠశాలల్లో 25 అద్దె భవనాల్లోనే కొన సాగుతున్నాయి. ఒక బీసీ, నాలుగు ఎస్సీ గురకులాలు సొంత భవనాల్లో ఉన్నప్పటికీ అక్కడ కూడా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేవు. 12 బీసీ గురుకులాల్లో 5,258 మంది విద్యార్థులు, 8 ఎస్సీ గురుకులాల్లో 3,230 మంది, 9 మైనార్టీ గురుకులాల్లో 3,500 మంది, గిరిజన గురుకులంలో 325 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
విద్యార్థులకు అందని దుప్పట్లు
చలికాలం కావడంతో రోజు రోజుకు చలితీవ్రత పెరుగుతునప్పటికీ, విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయలేదు. విద్యార్థులు చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. దీంతో చలి తీవ్రతను తట్టుకోలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకుంటుకున్నారు.
చలి తీవ్రత, దోమల స్వైర విహారంతో విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు గురుకులా ల్లో సరైన వసతులు కల్పించాలని ఆందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. గత 15 రోజుల్లో వంద మంది విద్యార్థులు జ్వరా ల బారినపడ్డారు.
ప్రభుత్వం వసతులు కల్పించాలి
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారు. గురుకులాలు ఎక్కువగా అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయా లి. దోమల నివారణకు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేయాలి. శనిగరపు రజనీకాంత్,
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు




