7 May, 2026 | 4:52 AM

ఓయూను సందర్శించిన తుర్కమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం

10-12-2024 06:24 PM

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): విద్య, బోధన, పరిశోధనల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. తుర్కిమెనిస్థాన్ ఎంబసీ కాన్సుల్ శముహమ్మత్ ముహమ్మదోవ్ తెలిపారు. ఈ మేరకు తుర్కమెనిస్తాన్ ఎంబసీ ప్రతినిధి బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఉపకులపతి ఆచార్య కుమార్ తో భేటీ అయ్యారు. తుర్కిమెనిస్థాన్ విద్యాశాఖ ఓయూతో కలిసి పనిచేసే అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. యూరప్ మినహా ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారని ప్రొఫెసర్ కుమార్ వివరించారు. తెలంగాణ విద్యార్థులు అత్యంత స్నేహశీలురని, విదేశీ విద్యార్థులతో కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో విద్యాబ్యాసం చేస్తారని అన్నారు.

తుర్కిమెనిస్థాన్ విద్యార్థులను ఓయూలో చేరాల్సిందిగా.... తమ సొంత పిల్లల్లా విదేశీ విద్యార్థులను చూసుకంటామని హామీ ఇచ్చారు. భాషా సమస్యలను అధిగమించేందుకు... ఆంగ్లంలో ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య విద్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఓయూలో అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలను తుర్కిమెనిస్థాన్ ఎంబసీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తమ దేశ విద్యాశాఖ మంత్రితో సమావేశమై ఓయూతో కలిసి పనిచేసే విషయమై చర్చించి పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని తుర్కిమెనిస్థాన్ ఎంబసీ కాన్సుల్ శముహమ్మత్ ముహమ్మదోవ్ తెలిపారు.

విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పరస్పరం సహకరించుకునేలా చర్యలు తీసుకుంటామని తుర్కి ఎంబసీ సెకండ్ సెక్రటరీ ఇస్కెందర్ అతలియేవ్ అన్నారు. ప్రపంచ దేశాల విద్యాసంస్థలతో ఓయూకున్న భాగస్వామ్యాన్ని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గడ్డం నరేష్ రెడ్డి వివరించారు. చారిత్రక వారసత్వం, విజ్ఞాన మార్గదర్శిగా ఓయూ కున్న చరిత్రను ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ నాయక్ తెలిపారు. విద్యారంగంలో ఓయూ అంతర్జాతీయంగా పనిచేస్తున్న విధానాన్ని ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ సంచాలకులు ప్రొఫెసర్ బి. విజయ వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఐఏ మాజీ డైరెక్టర్ ఆచార్య శివరామకృష్ణ, జాయింట్ డైరెక్టర్ ఆచార్య పి. సరితారెడ్డి, ఆచార్య శ్రీలత, ప్రొఫెసర్ ప్యాట్రిక్, ఇతర ఉద్యోగులు హాజరయ్యారు.