calender_icon.png 12 August, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల గుడిసెలను కూల్చివేయడం దుర్మార్గం

31-07-2025 01:16:31 AM

ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్

హనుమకొండ టౌన్, జూలై 30 (విజయ క్రాంతి): రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను తొలగించడం దుర్మార్గంమని, గుడిసెలను కూల్చివేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని పేదలకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం గీసుకొండ మండలం మొగిలిచర్ల శివారులోని పోగుల ఆగయ్య నగర్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న కూల్చివేయబడిన గుడిసెలను నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వంలో పేదల గుడిసెలు కూల్చివేయడం సిగ్గుచేటని ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మాదాసి సురేష్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పోగుల ఆగయ్య నగర్లో పేదలు గుడిసెలు వేసుకొని పక్కా గృహాలను నిర్మించుకున్నారని, గత ప్రభుత్వంలో వారికి ఇంటి నెంబర్లు కూడా కేటాయించారని 58, 59 జీవో కింద కూడా పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నారని అయినప్పటికీ గుడిసె వాసుల పక్కన భూకబ్జాదారులైన కొందరు అధికార పార్టీ నాయకుల విలువైన భూములు ఉండడం వలన వారికి మద్దతుగా అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేశారని ఆరోపించారు.

వెంటనే స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద ఇతర ఉన్నత అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, భూకబ్జాదారుల తోపాటు వారికి అండగా నిలుస్తున్న అధికారులను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది అసైన్డ్ భూమి సమితి(ఏబీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి మహేందర్, దళిత బహుజన ఫ్రంట్(డిబీఎఫ్) ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్,

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, ప్రజాసంఘాల నాయకులు పోత గోల్కొండ బుచ్చన్న, మాదాసి సుదర్శన్, మాజీ సర్పంచి దొంగల రమేష్, గుడిసె వాసులు గాజు కళమ్మ, గనిపాక రేణుక, గనిపాక రజిత, కోమల, సరిత, సరోజన, లక్ష్మీ తదితరులు పాల్గోన్నారు.