31-07-2025 01:17:58 AM
గజ్వేల్, జూలై 30: సిద్దిపేట జిల్లా యూరి యా కోటాలో గోల్‌మాల్ జరుగుతున్నది. వర్షాకాలం పంటసాగుకు అవసరమైన స్థాయి లో ప్రభుత్వం యూరియా కోటాను కేటాయించడంతోపాటు సరఫరా చేసినా కూడా రైతులు మాత్రం క్యూలో నిలబడాల్సి వస్తుంది. జిల్లావ్యాప్తంగా 2,87,411 ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతుండగా, వానాకాలం మొత్తానికి 40 వేల మెట్రిక్ టన్ను ల ఎరువులు అవసరం అవుతాయని జిల్లా వ్య వసాయ శాఖ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
జూలై నెలాఖరు వరకు 11,318 మెట్రి క్ టన్నుల యూరియా అవసరం కాగా, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 9,774 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు సరఫరా అయింది. ఈ సారి వానాకాలం ప్రారంభంలో వర్షాలు సరి గా కురువకపోవడంతో పంటసాగు ఆలస్యం గా ప్రారంభమైంది.
ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభం కావడం తో మరో పదిరోజులపాటు వరి నాట్లు కొనసాగే అవకాశం ఉంది. సాగు ఆలస్యం కాగా యూరియా నిల్వలు ప్రస్తుతం అవసరానికి మించి రెట్టింపు ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తు తం 3,127 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ లు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. సాగు ఆలస్యమైనా కూడా యూరియా ఎవరు వినియోగించారన్న ది ప్రశ్నార్థకంగా మారింది.
ఏప్రిల్, మే, జూన్ మాసాలలో పత్తి, మొక్కజొన్న తదితర పంట లు మాత్రమే సాగుకాగా వర్షాలు లేకపోవడం తో రైతులు యూరియాను వినియోగించే అవకాశం రాలేదు. అవసరం లేకున్నా యూరియా ను పెద్ద రైతులు కొనుగోలు చేశారన్న పేరుతో డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు యూరియాను బ్లాక్ చేసి జిల్లాను దాటించి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నట్లు పలువురు రైతులు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు యూరియా?
జిల్లాకు కేటాయించిన యూరియాను సాగుకు ముందే డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ చేసి జిల్లా బార్డర్ దాటించి వివిధ రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో రైతు లకు తిప్పలు తప్పడం లేదు. జూలైలో నిల్వలు అవసరమైన మేరకు మాత్రమే ఉండటంతో రైతుకు ఎకరానికి ఒకటి నుంచి రెండు బస్తాలు చొప్పున మాత్రమే అధికారుల పర్యవేక్షణలో యూరియాను విక్రయిస్తున్నారు.
యూరియా నిల్వలు అయిపోతాయన్న భయంతో రైతులు ఒకేసారి దుకాణాలకు వస్తుండటంతో క్యూ లో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిస్ట్రిబ్యూటర్ల అక్రమాలతో జిల్లాలో యూరియా కృత్రిమ కొరత ఏర్పడటంతో సాధారణ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నానో యూరియాపై అవసరమైన స్థాయిలో అధికారులు ప్రచారం చేయకపోవడంతో ఈ కష్టాలు మరింత ఎక్కువ అయ్యాయి.
రైతులు నానో యూరియాను వినియోగిస్తే పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉన్నా రైతుల్లో అవగాహన లేకపోవడంతో యూరియా కోసం ఎదురు చూడక తప్పడం లేదు. అధికారులు యూరియా బ్లాక్ మార్కెట్ తరలిపోయిందన్న నిజాన్ని ఒప్పుకోకపోవడం డిస్ట్రిబ్యూటర్లతో వారికున్న లోపాయి కారి ఒప్పందాలను బహిర్గతం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లడంలేదు
జిల్లాలో యూరియా బ్లాక్ మార్కెట్ అవుతుందన్న దాంట్లో వాస్తవం లేదు. ఎక్కడికక్కడ వ్యవసాయ శాఖ యూరియా కొనుగోలు విషయంలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నది. ప్రతి రైతుకు అవసరమైన మేరకే యూరియాను అందిస్తున్నాం. జిల్లాకు 9,774 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుతం 3,127 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదు. వరి పంట సాగు చేసే రైతులు అవసరమైన మేరకే యూరియాను వినియోగించాలి.
స్వరూపారాణి, జిల్లా వ్యవసాయ అధికారి, సిద్దిపేట