17 May, 2026 | 2:04 AM

మామిడ్గిలో డెంగ్యూ కలకలం

21-06-2024 12:10 AM

దవాఖానల్లో చికిత్స పొందుతున్న పలువురు ప్రజలు

పారిశుద్ధ్య లోపమే కారణమని గ్రామస్థుల ఆరోపణ 

అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపాటు

జహీరాబాద్, జూన్ 20: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామంలో డెంగ్యూ కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు గ్రామస్థులు డెంగ్యూ బారినపడి కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వ్యాధులు సంభవిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మురికి కాల్వలు చెత్తచెదారంతో నిండిపోయి కంపు కొడుతున్నాయని, తాగునీటి పైప్‌లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేపట్టడం లేదని వాపోతున్నారు. గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతుండడంతో పట్టించుకునే వారు లేరని ఆరోపించారు.

ఇది వరకే గ్రామానికి చెందిన పలువురు డెంగ్యూతో బాధపడి దవాఖానలో చికిత్స పొంది డిశ్చార్చ్ అయ్యారని, గురువారం గ్రామానికి చెందిన బిందు రెడ్డి, శైలంధర్ రెడ్డి అనే ఇద్దరు బీదర్ పట్టణంలోని ప్రైవేటు దవాఖానకు చికిత్స నిమిత్తం వెళ్లారని తెలిపారు. కాగా, డెంగ్యూ ప్రబలుతున్న విషయం తెలుసుకున్న మిర్జాపూర్ (బి) వైద్యాధికారులు, సిబ్బంది గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాల నుంచి వివరాలను సేకరించారు. గ్రామంలో వైద్య క్యాంపు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారికి మందులు మంపిణీ చేశారు. ఎవరికైనా తీవ్ర జ్వరం ఉంటే వెంటనే మిర్జాపూర్(బి) ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించారు.