17 May, 2026 | 3:06 AM

‘డబుల్’ ఇళ్లు కేటాయించండి

21-06-2024 12:10 AM

రామాయంపేటలో ఇళ్ల తాళాలు పగులగొట్టిన బాధితులు

మెదక్, జూన్ 20 (విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద గురువారం పలువురు బాధితులు తాళాలను పగులగొట్టి నిరసన తెలిపారు. రామాయంపేట పట్టణంలో గత ప్రభుత్వం 306 డబుల్ బెడ్‌రూంలను నిర్మించి, అర్హులైన వారికి 252 ఇండ్లను కేటాయించింది. మిగతా 54 ఇండ్లను రామాయంపేట పట్టణం నుంచి సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు కోల్పోయిన 25 మందికి, బస్టాండ్ నుంచి గాంధీ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన 29 మంది బాధితులకు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఇండ్లను కేటాయించకుండా తాళాలు వేసి ఉంచారు. దీంతో గురువారం సుమారు 150 మంది డబుల్ బెడ్‌రూం ఇండ్ల వద్దకు వచ్చి తాళాలు పగులగొట్టి ఇళ్లలో తిష్టవేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రజనీకుమారి, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్‌ఐ రంజిత్‌కుమార్, ఆర్‌ఐ రాజు, సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. తహసీల్దార్ రజనీకుమారి పలువురి వద్ద ఆధార్ కార్డులు తీసుకొని న్యాయం జరిగేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.