11-02-2026 01:51:52 PM
హైదరాబాద్: ఖమ్మం జిల్లా, మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇందిరా డెయిరీ పోలింగ్ కేంద్రంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు. నిజామాబాద్ పట్టణంలోని సన్ ఫ్లవర్ హైస్కూల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. పుట్టిన గడ్డపై రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వంగా ఉందన్నారు.
రాజ్యాంగం కల్పించిన వరం ఓటు హక్కు అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రజలకు సేవ చేసే, క్వాలిటీ ఉన్న నాయకులు ఎన్నికవుతారని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడే గెలవాలని తన ఆకాంక్ష అని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నిజామాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.