21-09-2025 08:20:00 PM
ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తో సుఖశాంతులు పెంపొందాలి
మహిళలు సంపదతో ఆర్థికంగా ఎదగాలి
వరంగల్లో బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): ప్రకృతిలో లభించే అనేక రకాల పూలతో తొమ్మిది రోజులపాటు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తారని, వారి పూజలు ఫలప్రదమై రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం రాత్రి వరంగల్ లో తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య ప్రదర్శనతో పాటు, వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభం అయిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారని గౌరమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని అన్నారు. రాష్ట్రంలో మహిళలంతా ఆర్థికంగా ఎదగడంతో పాటు శక్తివంతులుగా ఎదగాలని అన్నారు. అంతకుముందు కాకతీయ నృత్య నాటకోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మపై రూపొందించిన నృత్య నాటకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగల వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, సిపి సన్ ప్రీత్ సింగ్, కమిషనర్ చాహత్ వాజ్ పాయ్, సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆచార్య అలేఖ్య పుంజాల, ప్రజాప్రతినిధులు, అధికారులు, కవులు, కళాకారులు కళాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.