21-09-2025 08:50:39 PM
అలేఖ్య పంజాల ఆధ్వర్యంలో 45 నిమిషాల పాటు ఆకట్టుకున్న ప్రదర్శన..
హనుమకొండ (విజయక్రాంతి): కాకతీయ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ఆదివారం వహించిన కాకతీయ నృత్య నాటకోత్సవాలు ప్రేరణనిచ్చేలా జరిగాయి. ఈ నాటకోత్సవాలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ, వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జీవితం ఆధారంగా రూపొందించిన 45 నిమిషాల నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ, హౌసింగ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, సంబంధిత శాఖల అధికారులు పాల్గొని వీక్షించారు.
ఈ సందర్భంగా భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం చాకలి ఐలమ్మ జీవితం, పోరాట ఘట్టాలతో రూపొందించిన ఈ ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బతుకమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ బోనాలు సమర్పించే సన్నివేశాలు ముచ్చట గొలిపాయి. రజక వృత్తి జీవనవిధానం, పంట పై రైతుకు ఉండే ప్రేమను చూపింది. నాడు సాంప్రదాయ పండుగ బతుకమ్మ ఆడకుండా రజాకార్ సైన్యం, ఖాసీం రిజ్వి చేసిన ఆగడాలను ఓ సాధారణ మహిళగా ఐలమ్మ తిరగబడి, ఎదుర్కొన్న విధానం స్ఫూర్తి నింపింది. రజాకార్లు, దొరల ఆగడాలను 'ఎదిరించాలంటే బాంచెన్ దొర అనడం కాదు. కాళీ మాతలం అవుదాం..' అనే డైలాగ్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ఐలమ్మ పంటను రామచంద్రా రెడ్డి లాక్కెళ్ళేటప్పుడు ఆ దొరను ఐలమ్మ ఎదిరించడం రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. కొడవలి, కర్రలే ఆయుధంగా ఐలమ్మ, సహా సాధారణ మహిళలు రజాకార్లను ఎదిరించిన ధీరత్వం ప్రదర్శించింది. కార్యక్రమం లో ఎమ్మెల్యేలు కే ఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ రావు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. నేడు కాకతీ సామ్రాజ్యన్ని పాలించిన రాణి రుద్రమదేవి నృత్య నాటకాన్ని ప్రదర్శించనున్నారు.