13-08-2025 12:00:00 AM
కృతస్య వేతనం, నాకృతస్య అస్తి.. (కౌటిలీయం - 3-ఉద్యోగులు చేసిన పనికే వేతనాలు చెల్లించాలి కాని చేయని పనికి చెల్లించవద్దు అంటాడు, ఆచార్య చాణక్య. వస్తు ఉత్పతి వ్యయంలో ఉద్యోగుల వేతనాలు ప్రముఖమైనవి. ఉద్యోగుల ప్రగతియే నాయకునికీ ప్రగతి కాబట్టి ఉద్యోగుల పనికి సరైన వేతనాలు చెల్లించాలి. అత్యల్ప వేతనాలు చెల్లిస్తే వారు శ్రద్ధాసక్తులతో పనిచేయరు.. అలాగని అధికంగా చెల్లిస్తే ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది.
అందువల్ల అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మార్కెట్‌లో అదే పనికి ఎంత మొత్తం చెల్లిస్తున్నారో అంత మొత్తం చెల్లించడం వల్ల ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తారు. అలాంటి సంస్థలలో ఉద్యోగుల యాజమాన్య బంధమూ దృఢంగా నిలుస్తుంది. ఉద్యోగుల వలసలూ ఆగిపోతాయి. ఉద్యోగులు తాము చేయవలసిన పనులను శ్రద్ధగా చేస్తున్నారా లేదా అని అధికారులు దగ్గరుండి పరిశీలించాలి. అలాగే యజమాని ఉద్యోగికి ఎంత వేతనాన్ని చెల్లిస్తానని ఒప్పుకున్నాడో.. అంత వేతనాన్ని చెల్లించకుంటే యజమానికి జరిమానా విధించాలని చాణక్య చెపుతున్నారు.
మూడు పరిష్కార మార్గాలు..
సమర్ధులైన ఉద్యోగులను నియమించుకోవడం యాజమాన్యాని కెప్పుడూ పరీక్షయే. ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకున్న ఒక సంస్థ యజమాని వివిధ విద్యాసంస్థలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారిలో అత్యుత్తమ ప్రతిభావంతులను తన సంస్థలో నియమించుకునే వాడు. అయినా సంస్థలో ఆశించిన ఫలితాలు ఆవిష్కృతం కాలేదు సరికదా.. సమ్మెలు, బందులూ ఆరంభమై యాజమాన్య ఉద్యోగుల మధ్య అసహన వాతావరణం నెలకొన్నది. సంస్థ వ్యాపారం నిర్వీర్యమై నష్టాల అంచులకు చేరుకున్నది. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడేందుకు సమర్ధుడు, నిపుణుడైన ఉన్నతాధికారిని సంస్థ నియమించుకున్నది.
ఉన్నతాధికారి సంస్థ స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిస్థితిని అవగాహన చేసుకున్నాడు. ఇక ముందు సంస్థ ఆర్థికంగా ఏమాత్రం దిగజారినా ప్రమాదమని భావించి, ఉద్యోగులతోనూ, నాయకులతోనూ పరిస్థితిని కూలంకషంగా చర్చించాడు. ఉద్యోగుల పనితీరు నిరాశాజనకంగా ఉండటానికి కారణం సంస్థలో వారికి ప్రమోషన్ అవకాశాలు లేకపోవడమే. ఉన్నత విద్యలనార్జించినా, నైపుణ్యాలు కలిగినా, ఎదుగుబొదుగు లేని ఉద్యోగంలో, వేతనాలూ పెరగని పరిస్థితిలో అసంతృప్తి పెరిగిపోవడం సహజమే. పరిస్థితిని మూలాలలో అవగాహన చేసుకున్న ఆ అధికారి.. సమస్యకు పరిష్కారంగా మూడు ముఖ్యమైన విధానాలు ప్రతిపాదించాడు.
మొదటిది.. ఇక ముందు జరిగే నియామకాలలో ఉన్నత విద్యార్హతలు కాకుండా సాధారణ చదువుతో, సాధారణ తెలివితేటలతో ఉండే వ్యక్తులనే నియమించుకోవడం. అలాంటి వారికా ఉద్యోగాలు అరుదైన అవకాశాలుగా, మోసానికి ఆస్కారంలేనివిగా కనిపిస్తాయి. వారూ నిబద్ధతతో పనిచేస్తారు. రెండవది.. ఉన్నత విద్యార్హతలు, ఉత్తమ ప్రమాణాలు కలిగిన వారిని.. ఉన్నత వేతనాలతో, పరిమిత సంఖ్యలో నిర్వహణా విభాగాధిపతులుగా నియమించుకోవాలి. వారిని కేంద్ర కార్యాలయాల్లో కాకుండా వివిధ ప్రాంతాల కార్యాలయాల్లో నియమించాలి. మూడవదిగా వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు సంబంధిత విభాగాలన్నింటిలో పనిచేసేందుకు సన్నద్ధులయ్యే విధంగా వారికి అవసరమైన శిక్షణలను అందివ్వాలి. కాలావధిలో వారిని బదిలీలు చేస్తుండాలి.
ఉద్యోగుల సామర్థ్యం పరిగణలోకి..
ఈ విధానం సత్ఫలితాలనివ్వాలి అంటే ఉద్యోగుల నైపుణ్యాలను.. విజ్ఞానాన్ని గౌరవించడం, వారి హక్కులను కాపాడడం అవసరం. అలాగే ఉద్యోగుల ఉత్పాదకతా సామర్ధ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని వేతనాలను నిర్ణయించడం, ప్రోత్సాహకాలను అందివ్వడం వల్ల ఉత్తమ ఫలితాలను సాధించడం జరుగుతుంది. అయితే ఈ ప్రతిపాదనను సంస్థ అమలు చేసిందా లేదా అనే దానికన్నా సమస్య మూలాలను అన్వేషించి పరిష్కార మార్గాలను కనుగొనడం ఉత్తమమనేదే ప్రాధాన్యతాంశం.
సంస్థ ఉత్పత్తి వ్యయం కన్నా అమ్మకం వెల ఎక్కువగా ఉన్నప్పుడే ఆ సంస్థ నిలుస్తుంది. సంస్థ ఉంటేనే ఉద్యోగులకు ఉపాధి, సంస్థ విస్తరణ సాధ్యమవుతుంది. దానివల్ల మరింత మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికీ ఆదాయం సమకూరుతుంది. కాబట్టి లోపాలను సవరించుకుంటూ, వ్యర్ధాలను నియంత్రించుకుంటూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించుకుంటూ, ఉత్పత్తి వ్యయాన్ని అదుపు చేసుకోగలిగిన సంస్థ ఉన్నత స్థానంలో నిలుస్తుంది. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకునే యాజమాన్యం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంది.
నార్మేటివ్ కాస్ట్.. నార్మేటివ్ వ్యయం
సంస్థ ఉత్పత్తిని సాధించాలన్నా, సేవలను అందించాలన్నా అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను, ముడి సరుకులను సమకూర్చుకోవడం అవసరం. ఉత్పత్తి వ్యయాన్ని గణించేందుకు స్థూలంగా వేతన వ్యయం, ముడి సరుకుల వ్యయం, చెల్లించాల్సిన బిల్లుల వ్యయాన్ని పరిగణిస్తారు. ఉత్పత్తి వ్యయం, ప్రభుత్వ పన్నులు, పంపిణీదారులకు ఇవ్వాల్సిన కమీషన్, రవాణా ఖర్చులు, ఆశించిన లాభం కలిపి అమ్మకం వెలగా నిర్ణయించుకుంటారు.
వస్తువు ఉత్పత్తి ఏ నాణ్యతా ప్రమాణాల్లో జరగాలో, దాని పని విధానం ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించుకొని దానికి అవసరమైన ఆర్థిక విశ్లేషణనూ చేస్తారు. ఉదాహరణకు ఒక కారును ఉత్పత్తి చేస్తే సాధారణ పరిస్థితులలో దాని ప్రభావశీలత, ఇంధన సామర్ధ్యం, జీవితకాలం లాంటివి నిర్ణయమవుతాయి. అది ఆ “నార్మ్స్” ప్రకారమే పనిచేయకపోవచ్చు. ప్రయోగశాలలో చేయబడే ఆ విశ్లేషణ సూత్రప్రాయమైనదే కాని కచ్చితత్వానికి ప్రతీక కాదు. అయినా ప్రభావ శీలతకు ప్రాతిపదికగా గణింపబడుతుంది. దీనినే “నార్మేటివ్ కాస్ట్” అంటారు. ఈ విశ్లేషణ వల్ల ఉద్యోగుల వేతనాలను, ప్రోత్సాహకాలను నిర్ణయించడం సులువవుతుంది. “నార్మేటివ్ వ్యయం” ఉత్పత్తి వ్యయానికి దగ్గరగా ఉంటే సంస్థ పనితీరు ఉన్నతమని భావించవచ్చు.