13-08-2025 12:00:00 AM
దేశ చరిత్రలో సుపరిపాలనకు ప్రతిరూపంగా నిలిచిన మరాఠీ యోధురాలు అహల్యాబాయి హోల్కర్.. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాకు చెందిన చోండీ గ్రామంలో సుశీల, మంకోజి షిండే దంపతులకు మే 31, 1725న అహల్యాబాయి జన్మించారు. నిరాడంబరత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన అహల్యాబాయి ఆలయ సేవలను, భక్తిని, ప్రవర్తనను గమనించిన మాల్యా ప్రాంత సైనిక కమాండర్ మల్హర్ రావు తన 10 ఏళ్ల కుమారుడు ఖండేరావుకు ఇచ్చి వివాహం జరిపించారు.
1754లో కుంబేర్ ముట్టడి సమయంలో జరిగిన ఫిరంగుల కాల్పుల్లో ఖండేరావు మరణించగా.. నాటి ఆచారం ప్రకారం సతీ సహగమనం చేసుకోవడానికి సిద్ధపడిన అహల్యాబాయిని.. ఆమె మామ మల్హర్ రావు కాపాడారు. అనంతరం అహల్యాబాయికి రాజనీతి, రాజ్య పాలన, యుద్ధ నైపుణ్యాలు, ప్రజా సంక్షేమాల్లో శిక్షణ, రాజ్య వ్యవహారాలను చక్కదిద్దడంలో నేర్పరిగా మారారు. 1766లో మల్హర్ రావు మరణించగా.. ఆయన కుమారుడు మలేరావు రాజ్య బాధ్యతలు తీసుకున్న కొంతకాలానికే మానసిక అనారోగ్యంతో కన్నుమూశారు.
ఈ సమయంలో అహల్యాబాయి శక్తి, యుక్తి, పాలనా పటిమ, ప్రవృత్తి లాంటి సామర్థ్యాలను గుర్తించిన నాటి మరాఠా ముఖ్యులు ఆమె సింహాసనం అధిష్ఠించడానికి అనుమతిచ్చారు. అహల్యాబాయి మహారాణిగా పదవి చేపట్టిన తర్వాత తన సైన్యాన్ని ఆధునీకరిస్తూ బలోపేతం చేయడం, దౌత్య సంబంధాలను పటిష్ట పరచడం, పరిపాలనలో తనదైన ముద్రను చూపారు.
మహారాణిగా అహల్యాబాయి ఆలయాల పునరుద్ధరణకు విశేష కృషి చేశారు. తన పాలనలో అనేక కోటలు, రోడ్లు, బావులు, ధర్మశాలలు, హిందూ దేవాలయాలు, విశ్రాంతి గృహాలను నిర్మించారు. నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర్(నేటి మధ్యప్రదేశ్)ను రాజధాని గా నిర్ణయించారు. అనేక మంది కళాకారులు, శిల్పులకు ఉపాధి కల్పించడమే కాకుండా వారణాసి, ఘృష్ణేశ్వర్, త్రయంబక్, గయా, పుష్కర్, ద్వారక, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార్, మథుర, శ్రీశైలం, బృందావన్, నాథద్వారా, బద్రీనాథ్, కేథార్‌నాథ్ లాంటి పలు ఆలయాలను పునర్నిర్మించారు.
శివుడికి నివాళిగా దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగాలను పునరుత్థానం చేశారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కాశీ ఆలయాన్ని నాశనం చేసిన శతాబ్దం తర్వాత, ఆమె 1780లో కాశీ ఆలయాన్ని పునర్నిర్మించారు. 13 ఆగస్టు 1795న అహల్యాబాయి హోల్కర్ పరమందించారు. మహారాణి అహల్యాబాయి హోల్కర్ బహుముఖ ప్రజ్ఞకు గుర్తుగా ఇండోర్ విమానాశ్రయానికి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా, ఇండోర్‌లోని విశ్వవిద్యాలయానికి దేవి అహల్యాబాయి యూని వర్సిటీగా, సోలాపూర్‌లోని విశ్వవిద్యాలయానికి పుణ్యశ్లోక్ అహల్యాబాయి హోల్కర్ యూనివర్సిటీగా పేరు పెట్టారు.
తత్వవేత్తగా, మహారాణిగా, సమర్థురాలైన పాలకురాలిగా కీర్తించబడిన అహల్యాబాయి భక్తురాలిగా, ధైర్యం కలిగిన నాయ కురాలిగా కీర్తించబడ్డారు. ఆమె విలక్షణ సుపరిపాలన, సామాజిక సంస్కరణలు, సైనిక విజ యాలను విస్మరించిన నాటి పాలకులు చరిత్ర పుస్తకాల్లో అహల్యాబాయి హోల్కర్ ప్రస్తావనలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అహల్యాబాయి 300వ వర్ధంతి సందర్భంగా నేటి యువత.. ఆమె జీవిత చరిత్రను అవగతనం చేసుకొని ఆమె చూపిన బాటలో పయనించాలని కోరుకుందాం.
బుర్ర మధుసూదన్ రెడ్డి
సెల్: 9949700037