calender_icon.png 19 August, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెప్ప పాటులో తీసిన ఫోటోలు ఎన్నో భావోద్వేగాలు కలిగిస్తాయి: మంత్రి పొంగులేటి

19-08-2025 03:55:39 PM

ఫోటోగ్రాఫర్లందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు..

హైదరాబాద్: ఒక ఫోటో వేల పదాలకు సమాధానమని.. కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే జ్ణాపకాలను అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఆలోచనను వ్యక్తపరుస్తుందని తెలిపారు. రెప్ప పాటులో తీసిన కొన్ని ఫోటోలు ఎన్నో అర్ధాలను, ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తాయన్నారు. ఆ ఫోటో తీసిన విధానం, వారు పడిన కష్టం ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం(World Photography Day-2025) సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ హాటల్(Hotel Greenpark Hyderabad)లో సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి పొంగులేటి తిలకించారు. చాలా ఫోటోలు ఆకట్టుకునేలా ఉన్నాయని, అందులో ఓ మాజీ మంత్రికి సంబంధించిన ఫోటో ‘ఇంకేముంది అంతా అయిపోయింది’ అన్నట్టుగా ఆయనలో ఉన్న నైరాశ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. అద్భుతంగా తీసిన ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. మధుర జ్ణాపకాలను నెమరేసుకోవడంలోనే కాదు, క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో కూడా ఫోటోలు ఎంతో ఉపయోగపడిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తులో ఒకే ఒక్క ఫోటో కీలక ఆధారంగా మారి నిందితులకు శిక్ష పడేలా చేసిందని ఉదాహరించారు. 

సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రాజీవ్ యువ వికాసం, జనరల్ విభాగాల్లో గెలుపొందిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లను మంత్రి సన్మానించి అవార్డులు, రివార్డులను అందజేశారు. ఈ పోటీలో మొత్తం 94 మంది ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులు 744 ఫోటోలను పరిశీలించిన అనంతరం వాటిలో అత్యుత్తమ ఫోటోలను ఎంపిక చేసి విజేతలను ప్రకటించారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన 15 మంది ఉత్తమ ఫోటో గ్రాఫర్లకు రూ.20,000 / రూ.15,000 / రూ.10,000 లను అందజేశారు. మరో 25 మంది ఫోటో గ్రాఫర్లకు రూ.5000 చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఫోటో గ్రాఫర్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్ లో కూడా కొనసాగిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.