calender_icon.png 11 November, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప ఘనతను చాటేలా అభివృద్ధి

12-09-2024 05:00:00 AM

ఏ సమస్య వచ్చినా సంప్రదించండి

టూరిజం హబ్‌గా డెవలప్ చేయాలె

సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 11(విజయక్రాంతి): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధి కారులను పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  ఆదేశించారు. యునెస్కో ప్రమాణాల కు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని సూచించారు. బుధ వారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సచివాలయంలో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం రాష్ర్టస్థాయి మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. 

రామప్ప దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఏకైక కట్టడం రామప్ప దేవాలయమని, దాని కీర్తిని  ప్రపంచానికి చాటేలా అభివృద్ధి పనులను వేగవంతం చేయాల న్నారు. రామప్ప చుట్టుపక్కల ఎన్నో చారిత్రక ప్రాంతా లు, టూరిజం కేంద్రాలున్నందున ఆ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా డెవలప్ చేయాలన్నారు.  లక్నవరం, బొగత, సమ్మక్క సారలమ్మ దేవాలయం వంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు, అటవీ సంపద, ప్రకృతి సౌందర్యం పుష్కలంగా ఉన్న ములుగు పర్యాటకులను ఎంతగానే ఆకర్శిస్తుందన్నారు.

పర్యాటకులు బసచేసేందుకు వీలు గా టూరిజం కార్పొరేషన్ అన్ని హంగులతో హోటళ్లను నిర్మించాలని సూచించారు. రామప్ప వారసత్వ సంపద గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే యజ్ఞంలో అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎక్కడా లోపాలు జరక్కుండా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకరావాలన్నారు. దేవాలయంతో పాటు, రామప్ప చెరువు, ఆ చుట్టు పక్క ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

అలాగే, రామప్ప చెరువు, దేవాలయానికి ఆటంకం కలిగించే మైనింగ్, ఇతర పనులకు అనుమతులు ఇచ్చేది లేదని సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో సాంస్కృతిక, టూరిజం శాఖల కార్యదర్శి వాణీప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్‌రెడ్డి, ములుగు కలెక్టర్ దివాకర్, పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.