31-12-2025 09:18:18 PM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గృహ నిర్మాణ శాఖ పిడి ప్రకాష్ రావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తం జాడేలతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల విద్యాధికారులు, ఎపీఓలు, విద్యుత్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాలలో అభివృద్ధి పనులు, ఇంకుడు గుంతల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలలో సివిల్ పనులు, గ్రామాలలో పారిశుధ్య పనులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద పనుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గృహ నిర్మాణ ఎ.ఈ.లు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకొని ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద మంజూరైన ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని, త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అంగన్వాడి, పాఠశాల భవనాలకు ప్రధానమంత్రి జుగా క్రింద విద్యుత్ సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద అర్హులైన కూలీలకు పని దినాలు కల్పించేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించాలని తెలిపారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో కృషి చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.