29-09-2025 10:38:34 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఎన్నిక సమయంలో రేషన్ డీలర్ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. డీలర్ల నిరసన శిబిరానికి హాజరైన ఎమ్మెల్యే వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని రేషన్ డీలర్లు ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ వెంటనే చెల్లించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్న డీలర్ల సమస్య గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మోసగిస్తూనే ఉందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాని కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తే, ప్రస్తుతం తెలంగాణ ప్రజల బ్రతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయినదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ తో పాటు పలువురు రేషన్ డీలర్లు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.