calender_icon.png 30 September, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

29-09-2025 10:59:15 PM

పలుచోట్ల మహిళలతో ఆడి పాడిన ఎమ్మెల్యే..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లిలో సోమవారం రాత్రి మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పట్టణంలోని పలుచోట్ల నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని మహిళలతో కలిసి బతకమ్మ ఆడారు. పట్టణంలోని కాల్టెక్స్ ప్రాంతంలో మాజీ కౌన్సిలర్ దంపతులు నెల్లి  శ్రీలత రమేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వినోద్ ఆడి పాడారు. పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించిన మహిళలను ఆయన అభినందించారు. పట్టణంలోని 11వ వార్డులో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే స్థానికంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాన్ని దర్శించుకున్నారు.

రైల్వే స్టేషన్, ఏఎంసి, గంగారాం నగర్ ప్రాంతాల్లో మహిళలతో కలిసి ఎమ్మెల్యే వినోద్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రాంతంలో మహిళలు ఈసారి పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మహిళల సంక్షేమానికి తాను కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మను ఆడపడుచులందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలోని పలుచోట్ల మహిళలు బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పోచమ్మ చెరువు వద్ద అధికారులు కూడా బతుకమ్మ ఆడేందుకు మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి బతుకమ్మ వేడుకల ను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.