29-09-2025 11:01:32 PM
పులకరించిన పూల పండుగ వేడుకలు
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పూల పండుగకు మహిళలు ఉదయాన్నే లేచి ఉపవాసంతో తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో మహిళల పండుగైన బతుకమ్మ వేడుకలలో చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలు అందరు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో కూడలీల వద్ద, ఆలయాల వద్దకు చేరుకొని తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయ పాటలతో బతుకమ్మ ఆడారు. పల్లెల్లో, సింగరేణి కాలనీల్లో మహిళలు కోలాటాలాడారు. రాత్రి బతుకమ్మలను సమీప గోదావరి తీరంలో, చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. సత్తు పిండిని పంచి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.