29-09-2025 10:43:54 PM
కష్టపడితే ఫలితం వస్తుందనడానికి ఇదే నిదర్శనం
తెలంగాణ పోలీస్ యొక్క కీర్తిప్రతిష్టలు పెంచేలా నడుచుకోవాలని ఆకాంక్ష
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో మల్లంపల్లి మండలానికి చెందిన గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించిన మౌనికని, వారి తల్లిదండ్రులను జిల్లా పోలీసు అధికారుల సమక్షంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా కష్టపడి ఉద్యోగం సాధించిన మౌనికని అభినందించారు. అదేవిధంగా ఎల్లవేళలా తనకు వెన్నుదన్నుగా ఉండి తనను ప్రోత్సహించిన తన తల్లిదండ్రులను అభినందించారు. ఏ విధంగా అయితే ఉద్యోగం కోసం కష్టపడ్డారో ఉద్యోగంలో కూడా అదే విధంగా కష్టపడి విజయం సాధించాలని, తమ తల్లిదండ్రుల ఆశలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ పోలీస్ కుటుంబంలోకి తనను సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. కష్టపడి చదివితే ఎంతటి ఉద్యోగమైనా సాధించి తీరుతారని, ప్రపంచమంతటికి పరిచయమవుతారని, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెడతారని, దానికి ఉదాహరణ మౌనిక అని అన్నారు. ఉద్యోగం రాకముందు మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఏ విధంగా అయితే ఉంటామో, ఏ విధంగా ఆలోచిస్తామో ఉద్యోగం వచ్చాక కూడా ఏ లక్ష్యం కోసం అయితే కష్టపడ్డామో ఆ లక్ష్యం సాధించేంతవరకు అదేవిధంగా కృషి చేయాలని అన్నారు. ఎల్లప్పుడూ ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థగా పేరొందిందని, అందులో మీరు భాగమవుతున్నారని, పోలీస్ వ్యవస్థ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా నడుచుకోవాలని ఆకాంక్షించారు.