13-08-2025 01:07:01 AM
మునుగోడు, ఆగస్టు 12: మంత్రి పదవి ఇస్తామన్న హామీపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సం చలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని, పార్లమెంట్‌ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని.. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మ ల్లయ్య అన్న చందంగా ఉంది.
9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జి ల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్లగొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా, ఇద్దరం అన్న దమ్ములం సమర్థులమే, ఇద్దరం గట్టివాళ్లమే, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్న” అని వ్యాఖ్యానించారు. మంగళవారం మునుగోడు మండలం ఎలగలగూడెంలో గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ సత్యంతో కలిసి ప్రారంభించా రు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఆలస్యమైంది, సమీకరణాలు కుదరటం లేదని అంటున్నారు, ఎందుకు కుదరటం లేదని ప్రశ్నించారు. పదవి రాకుండా ఎవరడ్డుకుంటున్నారని నిలదీశారు. మంత్రి పదవిపై మాటిచ్చారు, పదవి ఇచ్చిన ప్పుడు ఇవ్వండిగానీ వెనకబడిన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మాత్రం ఆపొద్దని కోరారు. తనకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడుకు అన్యాయం జరగవద్దన్నారు. మునుగోడు వెనుకబడి ఉందని చెప్పారు. ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమేకానీ తన కోసం కాదన్నారు.