25 August, 2026 | 1:12 AM

ట్యాంకర్ బోల్తా.. రోడ్డు పాలైన వేలాది లీటర్ల డీజిల్

16-12-2024 03:42 PM

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌-మెట్టుగూడ మధ్య రైలు నిలయం సమీపంలో సోమవారం డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడటంతో వేలాది లీటర్ల డీజిల్ వృథా అయింది. డీజిల్‌తో నిండిన రహదారిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.  వివరాల్లోకి వెళితే... సోమవారం ఉదయం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ వద్ద డీజిల్‌తో కూడిన ట్యాంకర్ బోల్తా పడడంతో ఉద్రిక్తత నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నీటిని పోసి ఇంధనాన్ని పలుచన చేసి మంటలను అరికట్టారు. 

ఘట్‌కేసర్‌ నుంచి నగరానికి వెళ్తున్న ట్యాంకర్‌ మెట్టుగూడ వద్ద బోల్తా పడింది. ట్యాంకర్ పేలి పోతుందని భయంతో జనాలు పరుగులు తీశారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమీప అగ్నిమాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో సికింద్రాబాద్‌ నుంచి తార్నాక రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసు ఉన్నతాధికారులు అదనపు ట్రాఫిక్ పోలీసులను సంఘటనా స్థలానికి పంపారు.