మూడేళ్లు దాటిన వారిని బదిలీ చేయండి
- మేయర్‌కు సంఘాల నేతలు వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలో ఒకే చోట మూడేళ్లు, ఆపై విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీలు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరారు. మేయర్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు నర్సింగ్‌రావు మాట్లాడుతూ బల్దియాలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ నుంచి రికార్డు అసిస్టెంట్‌కు, రికార్డు అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్లుగా, జూనియర్ అసిస్టెంట్లను సీనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లను సూపరింటెండెంట్స్‌గా, సూపరింటెండెంట్స్‌ను అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించాలన్నారు.
ఒకే పోస్టులో మూడేళ్లకు మించి లాంగ్ స్టాండింగ్‌లో ఉంటున్న వారిని బదిలీ చేయాలన్నారు. ఈ బదిలీను సమగ్రంగా గ్రూప్ 4 ఉద్యోగి నుంచి జోనల్ స్థాయి తదితర ఉన్నతాధికారుల వరకూ ఉండేలా చేయాలన్నారు. మెడికల్ గ్రౌండ్‌లో అవసరం ఉన్నవారికి బదిలీలకు అవకాశం ఇవ్వాల న్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన కంపేషనేట్ నియామకాల ఫైల్స్ క్లియర్ కావడం లేదని వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం అన్ని రకాల సౌకర్యాలను తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలపై చేసిన వినతులన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు మురళి, రఘుపతి పాల్గొన్నారు.
విగ్రహాలపై యూనియన్లతో చర్చలు
జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఆవరణలో ముసుగుతో ఉన్న పలు విగ్రహాల విషయంపై చర్చించేందుకు యూనియన్ నాయకులతో మేయర్ గద్వాల విజయలక్ష్మీ శుక్రవారం ప్రత్యేక సమావేశం అయ్యారు. మాజీ మేయర్ బండా కార్తీకారెడ్డి హాయంలో బల్దియా కార్యాలయం ఆవరణలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి రాత్రికి రాత్రే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్నీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేశారు. అయితే, ఈ విగ్రహాల ఏర్పాటు వివాదస్పదం కావడంతో ఆవిష్కరణకు గురికాలేదు. దీంతో ఈ విగ్రహాలకు పరిష్కారం కనుగొనేందుకు కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. విగ్రహాలన్నీ ఒకే చోట కాకుండా ఒక్కో విగ్రహాన్ని ఒక్కో ప్రాంతంలో ఉంచాలనే నిర్ణయానికి వచ్చారు.






