3 May, 2026 | 2:26 AM

సక్సెస్ కూడా వాళ్లతో కలిసే పొందాలనుకున్నా!

03-05-2026 12:00 AM

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్‌చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుభాష్‌చంద్ర సినిమా గురించి విలేకరులతో పంచుకున్న ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. 

“నేను బీటెక్ చదువుతున్నప్పటి నుంచే షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించా. దాదాపు 80 షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. ఆ తర్వాత ఫీచర్ ఫిలిమ్స్‌లోకి వచ్చా. ఒక సినిమా షూటింగుకు వెళ్లే సమయానికి ఆగిపోయింది. మరో సినిమా రిలీజ్ కాలేదు. ఆ సినిమా విడుదల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దేనికైనా ఒక సమయం రావాలని నమ్ముతా. ఆ సమయం ‘గోదారి గట్టుపైన’ సినిమాతో వచ్చిందని భావిస్తున్నా. సుమంత్‌కు కథ చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది. ఇది ఆయనకు పర్ఫెక్ట్‌గా సరిపోయే కథ. ఆయనది గోదావరి అబ్బాయి పాత్ర. గోదారి యాసను పర్ఫెక్ట్‌గా పలికారు. అందుకోసం చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటివరకు నాతో పని చేసిన టెక్నీషియన్స్‌నే ఈ సినిమాకి తీసుకున్నా. కలిసి పని చేశాం కాబట్టి సక్సెస్ కూడా కలిసి పొందాలని అనుకున్నా. నా టీమ్ నాకు చాలా బలం. నా ఆలోచనలు వాళ్లకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. -ఈ కథ మన జీవితాల్లో చూసిందే. తండ్రి కూతురు మధ్య ప్రేమ ఒకటి.. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమ ఒకటి.. ఈ రెండింటినీ ముక్కోణంలో చూపించా. జగపతి బాబు పాత్ర మా బాబాయి స్ఫూర్తితో రాసుకున్నా. సినిమాలో ఆయన వాడిన బండి కూడా మా బాబాయిదే. ఎన్ని తరాలు మారినా ప్రేమ, భావోద్వేగం ఒకటే.

ఈ కథను చాలా పరిణితితో ట్రీట్ చేశాం. -ఈ కథే నటీనటులను ఎంచుకుంది. నిధి ప్రదీప్‌కు భరతనాట్యంలోనూ ప్రావీణ్యం కలిగి ఉంది. ఆమె కళ్లలో మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఈ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ అనిపించింది. నా చిన్నప్పటి ‘ఎగిరే పావురమా’ నుంచే లైలా నాకు ఇష్టం. జగపతిబాబుకు ఎదురుగా నిలబడే హుందాతనం ఉన్న పాత్ర కావాలని ఆమె తీసుకున్నాం. నాకు ఎప్పుడూ కథను షార్ఫ్‌గా చెప్పడం ఇష్టం. చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా చెప్పితేనే నచ్చుతుంది. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక రెట్రో సాంగ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ సినిమాలో చిత్ర, ఎస్పీ చరణ్‌తో ఆ పాటను పాడించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. నిర్మాత అభినవ్ చాలా ప్రొఫెషనల్. ఎవరి పని వారు చేయాలనేదే ఆయన సిద్ధాంతం. మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. -నాకు స్టీవెన్ స్పిల్బర్గ్ ఇన్స్‌పిరేషన్. -నాకు హారర్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పటివరకు ఎక్కువగా రొమాంటిక్ కామెడీలు చేశా. భవిష్యత్తులో మంచి హారర్ థ్రిల్లర్ చేయాలనుంది” అని తెలిపారు.